టాలీవుడ్ లో గోపిచంద్ కి మాస్ ఇమేజ్ బాగానే వచ్చింది. కాస్త కమర్షియల్ సక్సస్ సినిమాలు కూడా గోపి లిస్ట్ లో ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా గోపి సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోతున్నాయి. వరుసగా ఫ్లాప్ అవుతు అమాంతం గోపీ ఇమేజ్ మొత్తం పడిపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చాణక్య సినిమా కూడా దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు హీరో గోపీచంద్ ను డైలమాలో పడేలా చేసింది. తను ఎలాంటి సినిమాలు చేస్తే, సక్సెస్ అవుతాననే ఆలోచనలో పడినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం గోపి చేతిలో వున్న రెండు సినిమాలు చేయడమా? వదిలేయడమా? లేదా కమిటయిన ఆ కథలు మార్చడమా..అనే ఆలోచనలో వున్నాడట. 

ప్రస్తుతం గోపి ఒక సినిమాను బోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో చేయాల్సి వుంది. చాలావరకు ఆ సినిమా విషయంలో సానుకూలంగానే వున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ తరువాత చేయాల్సిన సంపత్ నంది సినిమా విషయంలో మాత్రం మళ్ళీ ఆలోచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తన మార్కెట్ ఎంత వుందో? ఎంతవరకు పడిపోయిందో గోపికి బాగా అర్థం అవుతోంది. ఇలాంటి టైమ్ లో మరీ భారీ బడ్జెట్ సినిమాతో రిస్క్ చేయడం అంత అవసరమా? లేదా కాస్త రీజనబుల్ బడ్జెట్ లో ఆ సినిమాని  నిర్మించేలా కథ మార్చడమా? లేదా ఆ కథను కంప్లీట్ గా పక్కన పెట్టి మరో కథని చూడమని అడగడమో చేయాలని గోపీచంద్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు లేటెస్ట్ న్యూస్.

గతంలో తనకి ఉన్న హిట్ సినిమాల లిస్ట్ చూస్తే, లౌక్యం, లక్ష్యం లాంటి ఎంటర్ టైన్ మెంట్ వున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాక్షన్ సినిమాలు, గౌతమ్ నందా లాంటి భారీ సినిమాలు గోపి కి అసలు కలిసి రాలేదు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలని గోపీచంద్ నిర్ణయించుకుంటున్నాడట.
అవసరం అయితే వేరే దర్శకులు ఎవరైనా మంచి కథ తో వస్తే, ఇప్పటికే ఓకె చేసిన నిర్మాతలకు ఇచ్చే ఆలోచన కూడా వుందని తెలుస్తోంది. మరి గోపి తో ఎవరు ప్రాజెక్ట్ ముందు స్టార్ట్ చేస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: