తెలుగు సినిమాల్లో బ్రహ్మాజీ పేరు తెలియనివారు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా తెలుగు సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటున్నాడు. లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సైరాలో చిరంజీవి అనుచరుడిగా ముఖ్య పాత్రలో నటించి మెప్పించాడు. ఆ సినిమాలో తను పోషించిన పాత్రకు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.
సైరాలో నరసింహారెడ్డి అనుచరుడు ఓబన్నగా బ్రహ్మాజీ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాడు. చిరంజీవితో పాటు గుర్రపు స్వారీ, యుద్ధ సన్నివేశాల్లో కూడా నటించాడు. ఆ పాత్రకు సంబంధించి షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తున్న తన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియలో బ్రహ్మాజీ గుర్రపు స్వారీని చాలా ఈజ్ తో చేస్తూ రౌద్రంగా కనిపించాడు. దీంతో ఈ వీడియోకు విపరీతంగా లైక్స్ వస్తున్నాయి. నెటిజన్లు బ్రహ్మాజీని ఉద్దేశిస్తూ.. ‘ఇప్పుడే ఇలా ఉంటే అప్పట్లో ఇంకెంత చేశారో, నీకు ఇంకా వయసు అవలేదు బుజ్జీ, అదరగొట్టేశారు’ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏపాత్ర పోషిస్తే ఆ పాత్రలో ఇమిడిపోయే బ్రహ్మాజీ సైరాలో ఓబన్నగా పవర్ ఫుల్ పాత్ర పోషించి సినిమా విజయంలో భాగమయ్యాడు.
1989లో శివ సినిమాలో కూడా నటించాడు బ్రహ్మాజీ. రెండు దశాబ్దాల క్రితం కృష్ణవంశీ సిందూరం సినిమాలో హీరోగా కూడా చేశాడు. అయితే హీరోగా బ్రేక్ రాలేదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. తాను ఇండస్ట్రీలో నిలవడానికి కారకుడు బ్రహ్మాజీ.. అందుకే అతన్ని హీరోని చేయాలని ఫిక్స్ అయి సిందూరం తీశానని బ్రహ్మాజీ గొప్పదనం గురించి ఓ సందర్భంలో చెప్పాడు కృష్ణవంశీ. అప్పటి నుంచీ మంచి క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో మంచి నటుడిగా స్థిరపడ్డాడు.