సినిమాల్లో, నాటకాల్లో చివరికి మన జబర్దస్త్ స్కిట్స్ లో కూడా మగ వారు ఆడ వేషం వేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇలా ఆడవేషాలు వేసేవాళ్ళని కొంత మంది ఎగతాళి చేస్తూ, ఆటపట్టిస్తుంటారు కూడా. కానీ ఒక వ్యక్తి స్త్రీ వేషం వేసుకున్నాక, ఒక్కరు కూడా హేళన చేయరు. పైగా ఆయన పాదాలకు నమస్కరిస్తారు. మేకప్‌ తీశాక కూడా ఎవ్వరూ అతన్ని ఎగతాళి చేయరు. బాలీవుడ్‌లో వచ్చిన  ‘డ్రీమ్‌ గర్ల్‌’ సినిమాలో హిందీ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన ఆడ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.


ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఒక కాల్‌ సెంటర్‌లో పనిచేస్తూ...ఆడ గొంతుతో మాట్లాడుతుంటాడు.  అంతేకాదు తను నివసించే ప్రాంతంలో  ‘రామ్‌లీల’ నాటకంలో సీతాదేవి పాత్ర పోషిస్తుంటాడు. 
నాటకం అయ్యాక, మామూలు మగ దుస్తుల్లో ఉన్నా కూడా స్థానికులొచ్చి అతడి.. అంటే సీతాదేవి ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు.అది సినిమా అయితే నిజ జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతోంది. ముప్పై ఆరు సంవత్సరాల గోవింద మౌర్య అనే కళాకారుడు ఢిల్లీ రామలీలా సన్నివేశంలో, పదిహేడు సంవత్సరాలుగా సీతాదేవి పాత్రను ఎంతో భక్తి, నేర్పుగా ప్రదర్శిస్తున్నాడు. 


ఆయన మేకప్‌ తీసేసినప్పుడు కూడా ఎంతోమంది భక్తులు ఆయన (సీతాదేవి) ఆశీర్వాదాల కోసం రావడం అతడికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.  ‘‘నన్ను చూసి చాలామంది అప్పుడప్పుడు, ‘అదిగో సీతను చూడు. మేకప్‌ లేకపోయినా కూడా అచ్చంగా సీతమ్మ తల్లిలా ఉన్నాడు’ అంటూ నన్ను ఆరాధనగా చూస్తుంటారు’’ అంటారు గురుగ్రామ్‌కి చెందిన ఈ గోవింద మౌర్య. గోవింద మౌర్య బాల్యం నుంచి తన గ్రామంలో జరిగే రామ్‌లీల నాటకాన్ని చూసేవాడు.‘‘ఓసారి అతను రామ్‌లీలా చూస్తున్నపుడు  అతని గొంతు వారికి నచ్చి... స్టేజీ మీదకు తీసుకువెళ్లి, అతనితో మాట్లాడించారు’’ అలా మొదట అతడికి సీతాదేవి తల్లి పాత్రను ఇచ్చారు.


పదిహేను రోజులవ్వగానే సీతాదేవి పాత్ర ఇచ్చారు.  సీతాదేవి పాత్రలో – ‘‘సఖీ, ఒక్కసారి నిలువుము. నాకు కొంచెం బెదురుగా ఉంది’’ అనే డైలాగులు వింటుంటే అమ్మాయే మాట్లాడుతోందేమో అనుకునేలా మాట్లాడతారు గోవింద.  సీతాదేవిని కలవడానికి శ్రీరామచంద్రుడు పుష్పవాటికకు వచ్చిన సందర్భంలో ఈ సంభాషణ ఉంటుంది.  అయితే సీతాదేవి పాత్రను గోవింద పోషించడం అతని కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదు. ‘‘కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు తప్పదు అంటున్నాడు గోవింద్.గతంలో నేను లెదర్‌ ఫ్యాక్టరీలో పనిచేశాను. అది మూత పడటంతో ఇంటి ఆర్థిక అవసరాల కోసం ఈ పాత్ర పోషిస్తున్నాను’’ అంటారు గోవింద. అయితే ఈ పాత్ర పోషించినందుకుగాను పారితోషికం ఆయనకు నగదు రూపంలో అందటం లేదు.  ఇంటికి పనికివచ్చే వస్తువులు ఇస్తున్నారు.
ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు రామ్‌లీలాలో నటిస్తున్నారు.  కాని ఆడపాత్రలను మగవారు పోషించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది’’ అంటారు గోవింద.


మరింత సమాచారం తెలుసుకోండి: