మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ కి తెలుగు ప్రేక్షకులు పడుతున్న బ్రహ్మరధం మరొకసారి అతడి స్టామినాను సూచిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ఇంతటి అభిమానం పొందిన ‘సైరా’ కు బాలీవుడ్ లో జరిగిన ఘోర అవమానం మాత్రం మెగా ఫ్యామిలీకి ఊహించని అవమానం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ బాలీవుడ్ రైట్స్ ను 25 కోట్లకు అమ్మితే ఈమూవీకి కేవలం 12 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చి ఈ మూవీ బాలీవుడ్ బయ్యర్ కు అత్యంత భారీ నష్టాలు వచ్చాయి. దీనితో తన నష్టాలకు చరణ్ ఏమి సమాధానం చెపుతాడు అంటూ ఆ బయ్యర్ చరణ్ తో రాయబారాలు నడుపుతున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థితులలో టాలీవుడ్ ను షేక్ చేసిన మెగా హీరోల మ్యానియా బాలీవుడ్ కు పనికిరాదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

వాస్తవానికి చిరంజీవి మెగా హీరోగా తెలుగులో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న రోజులలోనే ‘ఆజ్‌కా గూండారాజ్’ ‘ప్ర‌తిబంద్’ లాంటి సినిమాల‌తో బాలీవుడ్ లో తన ప్రయత్నాలు చేసినా చిరంజీవి కష్టానికి సరైన ఫలితం రాకపోవడంతో తిరిగి అతడు బాలీవుడ్ వైపు చూడలేదు. అయితే ‘బాహుబలి’ ఇచ్చిన స్పూర్తితో తిరిగి చిరంజీవి మళ్ళీ ‘సైరా’ తో మరో భారీ ప్రయత్నం చేసాడు. 

ఈ ప్రయత్నంలో కూడ చిరంజీవికి నిరాశ ఎదురైంది. అంతేకాదు రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ‘జంజీర్’ రీమేక్‌తో నేరుగా హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు ఆ ప్రయత్నాలు కూడ ఘోరంగా విఫలం అయ్యాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను హిందీలో డబ్ చేసి తెలుగు వెర్షన్ తో పాటు ఒకేరోజు హిందీలో విడుదల చేసినా కనీసం ఆ మూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాలేదు. అదేవిధంగా మెగా హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ మళయాళ ప్రేక్షకుల మన్ననలను పొందలేకపోతున్నారు. ఒక్క కన్నడ ప్రాంతంలో మాత్రమే వీరికి ఇమేజ్ ఉంది. దీనితో మెగా హీరోల ఇమేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమా అంటూ కొందరు విశ్లేషణాత్మక కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: