సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు లాంగ్ టైం ఉండటానికి హీరోలని, దర్శక, నిర్మాతలను కాకా పడుతు భజన చేస్తూ అణిగిమణిగి ఉంటారు. చాలా తక్కువమంది మాత్రమే టాలెంట్ మీద నమ్మకంతో ముక్కుసూటిగా మాట్లాడుతు మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు అనేస్తారు. అలాంటి దర్శకుల్లో తేజ అందరికంటే ముందుంటాడు. నిజాలని నిరభ్యంతరంగా మాట్లాడటానికి ఏమాత్రం సందేహించడు. సినీ జనాల మీద తనకున్న అభిప్రాయాన్ని టపీ మని అనేస్తాడు. అలానే కమల్ హాసన్ ని కూడా కామెంట్ చేశాడు. అందులో నిజముంది అనుకునేవాళ్ళే ఎక్కువమంది ఉంటారు.

చాలామంది కమల్ హాసన్ ను మహానటుడు అంటారు. నేను మాత్రం ఒప్పుకోను. దశావతారంలో ఆయన 10 గెటప్స్ వేశాడు. బాగా చేశాడని అంతా అనుకున్నారు. కానీ ఆ 10 గెటప్స్ లో కమల్ హాసనే కనిపించాడు. ఒక్క గెటప్ లో కూడా ఆయన పోషించిన పాత్ర కనిపించలేదు. అదే రోబో సినిమాలో రజనీకాంత్ ను చూస్తే, ఓ సీన్ లో సైంటిస్ట్ రజనీని చంపాలని రోబో ప్రయత్నిస్తుంటుంది. రోబోలా మారువేషం వేసుకున్న సైంటిస్ట్ ను గుర్తుపట్టేస్తుంది. అక్కడ మనకు రోబోలో రజనీకాంత్ కనిపించడు. ఆ పాత్ర కనిపిస్తుంది. అదే ఒక నటుడుకి ఉండాల్సిన గొప్పదనం. పాత్రలో కమల్ కనిపించకూడదు, క్యారెక్టర్ కనిపించాలి...కానీ ఆయన అలా కనిపించలేదు..అన్నారు.

ఈ విధంగా తేజ ఎప్పటిలాగే తన స్టైల్లోనే కమల్-రజనీ మధ్య నటనలో ఉన్న తేడాల్ని విశ్లేషించాడు. నటన అనేది వారసత్వంతో రాదని, నిబద్ధతతో వస్తుందని అంటున్న తేజ.. ఎంతో కష్టపడితే తప్ప స్టార్స్ కాలేరని ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారసత్వ నటులకు చురకలు అంటించారు. బ్యాగ్రౌండ్ తో అనూహ్యంగా కొందరు స్టార్స్ అయిపోయినా ఎక్కువ రోజులు నిలబడరంటు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్స్ ఊరికే అవ్వరు. మన ఆత్మ, ఊపిరి అంతా నటనలో పెట్టి కష్టపడితేనే స్టార్స్ అవుతారు అంటూ కామెంట్ చేశాడు. 

తన దృష్టిలో కారవాన్ లో ఉండేవాడు హీరో కానేకాదంటున్నాడు తేజ. ఇతర నటుల యాక్టింగ్ ను కూడా గమనిస్తూ సెట్స్ లో ఉండేవాడే నిజమైన స్టార్ అవుతాడని... అమీర్, అమితాబ్, చిరంజీవి లాంటి నటులు అదే పనిచేశారని తన అనుభవాల్ని గుర్తుచేసుకున్నాడు. మొత్తానికి మరోసారి సౌత్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలని కంపేర్ చేస్తూ చేసిన కామెంట్స్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: