మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మాతలుగా తెరకెక్కిన మహర్షి సినిమా మే నెలలో విడుదలైంది. సినిమాకు హిట్ టాక్ రావటం, వేసవి సెలవులు కలిసిరావటంతో సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. రిషి పాత్రలో మహేశ్ బాబు అభినయానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న మహర్షి స్మాల్ స్క్రీన్ మీద మాత్రం యావరేజ్ రేటింగ్ తో సరిపెట్టుకుంది. 
 
దసరా పండుగ కానుకగా జెమినీ టీవీలో మహర్షి సినిమా టెలికాస్ట్ కాగా అదే సమయంలో స్టార్ మాలో ఓ బేబీ సినిమా టెలికాస్ట్ అయింది. మహర్షి సినిమాకు 9.2 టీఆర్పీ రేటింగ్ రాగా ఓ బేబీ సినిమాకు 9 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. నిజానికి మహేశ్ బాబు సినిమాలు కొన్ని థియేటర్లలో కంటే బుల్లి తెర మీదే బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. అతడు, ఖలేజా సినిమాలు విడుదలై చాలా సంవత్సరాలే అయినప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్స్ ఇప్పటికీ సాధిస్తున్నాయి. 
 
ఈ సంవత్సరం టెలికాస్ట్ అయిన సినిమాలలో ఎఫ్2 సినిమా 17.20 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. లారెన్స్ నటించిన కాంచన 3 సినిమా 13.10 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. మొదటి రెండు స్థానాల్లో ఎఫ్ 2, కాంచన 3 ఉండగా మహర్షి, ఓ బేబీ తరువాత స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్ 20కి అటూ ఇటూ ఉండగా ప్రస్తుతం ఈ రేటింగ్స్ 10కి అటూ ఇటూ ఉండటం గమనార్హం. ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావటం మహేశ్ బాబుకు షాక్ అనే చెప్పవచ్చు. 
 
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో స్టార్ హీరోల సినిమాలు విడుదలైన నెల, రెండు నెలలకే హెచ్ డీ క్వాలిటీతో అందుబాటులోకి వస్తూ ఉండటం కూడా టీఆర్పీ రేటింగ్స్ తగ్గటానికి కారణమవుతోందని తెలుస్తోంది. మహర్షి సినిమా మూడు నెలల క్రితం నుండే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండటంతో ఆ ప్రభావం టీఆర్పీ రేటింగ్ పై పడినట్లు తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: