బాలీవుడ్ మెగాస్టార్ గా పేరుగాంచిన లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు అనే చెప్పాలి. సాత్ హిందుస్తానీ సినిమాలోని అన్వర్ అలీ అనే పాత్ర ద్వారా తొలిసారి బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసిన అమితాబ్ బచ్చన్ గారు, తొలి సినిమాలో తాను ప్రదర్శించిన అద్భుత నటనకు గాను అప్పట్లో జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన అమితాబ్, కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 

అయితే కొన్నేళ్ల క్రితం అకస్మాత్తుగా ఒక సినిమా లోని ఫైట్ షూటింగ్ సమయంలో ఆయన కడుపులో అవతలి వ్యక్తి బలంగా గుద్దడంతో విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆయనకు వెంటనే శస్త్ర చికిత్సను అందించారు. అంతేకాక అనంతరం మరొక సినిమా షూటింగ్ సమయంలో ఆయన కాలుకి బలంగా గాయం అవ్వడంతో ఆపరేషన్ చేసే సమయంలో కొంత కలుషిత రక్తం ఎక్కించడం వలన తనకు హెపటైటిస్ బి వ్యాధి సోకిందని, దాని కారణంగానే తనకు లివర్ మెల్లగా డ్యామేజీ అవుతూ, ప్రస్తుతం తాను 25 శాతం మాత్రమే లీవర్ పనితీరుతో బ్రతుకుతున్నానని అమితాబ్ ఇటీవల షాకింగ్ నిజాలు బయటపెట్టడం జరిగింది. అయితే తన ఆరోగ్యంపై మాత్రం ఎప్పటికపుడు శ్రద్ధ గానే ఉంటాను అని చెప్పే అమితాబ్, ఇటీవల రెండు రోజుల క్రితం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరినట్లుగా దేశవ్యాప్తంగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

అయితే ఈ విషయమై నేడు నానావతి ఆసుపత్రి సిబ్బంది సహా, కౌన్ బనేగా కరోడ్ పతి షో నిర్వాహకులు స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా కొట్టిపాసినట్లు తెలుస్తోంది. నిజానికి అమితాబ్ గారు రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్ళిన మాట వాస్తవమేనని, మీడియాలో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న ఫోటో అదేనని, అయితే ఆయన ఆసుపత్రికి కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారని, కొద్దిరోజుల్లో కౌన్ బనేగా కరోడ్ పతి లేటెస్ట్ సిరీస్ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారని, కావున వారి ఆరోగ్యంపై వస్తున్న ఎటువంటి వదంతులను నమ్మవద్దని అంటున్నారు. ఇక వారి ప్రకటనతో అమితాబ్ ఆరోగ్యంపై ప్రచారం అవుతున్న కథనాలకు చాలావరకు ఫుల్ స్టాప్ పడ్డట్లైంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: