టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన లభించడంతో, కొద్దిరోజుల క్రితం సినిమాలోని సామజవరగమనా అనే పల్లవితో సాగె మంచి రొమాంటిక్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను యువ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ అతిపెద్ద రికార్డు ని సొంతం చేసుకుంది. ఇప్పటికే యూట్యూబ్ లో 40 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్, 700K లైక్స్ తో అత్యధికులు లైక్ చేసిన తెలుగు సాంగ్ ఆ ఒక కొత్త చరిత్ర సృష్టించింది. కాగా ఇప్పటివరకు విజయ్ దేవరకొండ మరియు రష్మికల కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలె సాంగ్ 569K లైక్స్ తో మొదటి స్తానంలో ఉండగా, దానిని సామజవరగమనా సాంగ్ బీట్ చేసింది. ఇక ఈ రెండిటి తరువాత భరత్ అనే నేను, బాహుబలి 2, అరవింద సమేత సినిమాల్లోని సాంగ్స్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. 

కాగా ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు త్రివిక్రమ్ మరియు బన్నీల కంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయం సాధించడంతో, హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న అల వైకుంఠపురములో కూడా తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయబోతున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: