మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సంబంధించి ఈ రోజు జరిగిన సమావేశం రసాభసగా మారింది. ‘మా’ అధ్యక్షుడు నరేశ్ లేకుండా జరిగిన ఈ సమావేశంలో వాదనలు, అరుపులు తప్ప అసలు ప్రస్తావించదలచుకున్న అంశాలేవీ రాలేదు. పైగా.. జనరల్ మీటింగ్ అని పిలిచి జనరల్ బాడీ మీటింగ్ మార్చేశారంటూ సభ్యులు కూడా వాపోయారు. పరుచూరి వెంకటేశ్వర రావు అలిగి వెళ్లిపోవడం.. పృథ్వీ తన పదవికి రాజీనామా చేస్తాననటంతో సమావేశం జరిగిన తీరు స్పష్టమవుతోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేది ఎవరంటే అందరి చూపు చిరంజీవి వైపే వెళ్తోంది.

 


ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాసరి లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తర్వాత ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారనేదానిపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరివాడుగా పేరు తెచ్చుకున్న చిరంజీవి మాత్రమే దాసరి స్థానానికి అర్హుడనే వాదనలు వినిపించాయి. తర్వాత దీనిపై అందరూ స్తబ్దుగా ఉండిపోయారు. ఈరోజు జరిగిన మా సమావేశం తీరుతో మళ్లీ దాసరి స్థానంపై చర్చలు మొదలయ్యాయి. దీంతో అందరూ చిరంజీవి వైపే చూస్తున్నారు. చిరంజీవి ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుడనే విషయం తెలిసిందే. ఎనిమిది నెలల క్రితం జరిగిన మా ఎలక్షన్స్ లో కూడా చిరంజీవి సపోర్ట్ చేసిన ప్యానలే గెలిచిందని ఇండస్ట్రీ కోడై కూసింది. గతంలో ఎన్నికైన రాజేంద్రప్రసాద్ కూడా చిరంజీవి అండతోనే గెలిచినట్టు ప్రత్యక్షంగా తెలిసిపోయింది.

 


ప్రస్తుతం ‘మా’లో బయటపడ్డ విబేధాలను పరిష్కరించేందుకు చిరంజీవే పూనుకోవాలని అంటున్నారు. ‘మా’ సమావేశం జరిగిన తీరుతో ఇక్కడ ఎవరికీ పొసగట్లేదనే సంకేతాలు వెళ్లాయి. దీనిపై పూర్తి స్పస్పత లేకపోయినా అంతరంగికంగా వారిలో ఉన్న విబేధాలు బయటపడ్డాయనడంలో సందేహం లేదు. మరి దీనిపై చిరంజీవి దృష్టి సారిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: