26 ఏళ్ల చరిత్ర కలిగిన 'మా' లో గత కొంతకాలంగా.. ఎప్పుడు లేని విధంగా రచ్చలు జరుగుతున్నాయి. ఒకరినొకరు దూషించు కోవడాలు, అరుచు కోవడాలు,అలగడాలు... ఇలా నానా రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు గుట్టుగా కొట్టుకున్న వీళ్లందరు ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆదివారం జరిగిన 'మా' సమావేశం తరవాత అసోసియేషన్ గురించి మీడియాలో, సోషల్ మీడియాలో.. రక రకాల వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు నరేష్‌కు జనరల్ సెక్రటరీ జీవితకు పడటం లేదని.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెండు వర్గాలుగా చీలిపోయారని అన్నారు. దీనికి తోడు ఆదివారం నాటి మీటింగ్‌కు అధ్యక్షుడు నరేష్ హాజరుకాకపోవడంతో ఈ గొడవ మరింత హైలైట్ అయింది. 

దీంతో సోమవారం ఉదయం జీవిత, అదేరోజు సాయంత్రం అధ్యక్షుడు నరేష్  మీడియా ముందుకు వచ్చారు. అసలు అధ్యక్షుడితో సంబంధం లేకుండా పెట్టిన మీటింగ్‌కు తానెందుకు వెళ్తానని నరేష్ అన్నారు. అలాగే, 26 ఏళ్ల చరిత్ర కలిగిన 'మా' రాజ్యాంగాన్ని వీళ్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది 'మా'కు పెద్ద డ్యామేజీ అని కూడా అన్నారు. నరేష్ మాటలపై 'మా' ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొంత మంది స్పందించారు. జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ స్నేహ, ఈసీ మెంబర్లు సమీర్, జయలక్ష్మి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేష్‌పై సమీర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసీ మెంబర్స్‌ మధ్య విభేదాలు ఉండటం వాస్తవమని గుట్టు రట్టు చేశారు. 

'మా'లో అందరం కలిసున్నామంటున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని సమీర్ అభిప్రాయపడ్డారు. నా 'మా'కి ఇబ్బంది కలిగితే నేను ఒప్పుకోను.. నా 'మా'ని ఎవరైనా కించపరిస్తే నేను ఒప్పకోను అంటారు. నా 'మా' ఏంటి మేమందరం ఎక్కడి నుంచి గెలిచాం.. నడిగర్ సంఘం నుంచా..? అని నరేష్ మీద సమీర్ ఫైర్ అయ్యారు. ఆదివారం నిర్వహించిన సమావేశాన్ని పనికిమాలిన మీటింగ్ అంటున్నారు. కానీ ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్(ఈజీఎం) నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి పెట్టిన సమావేశమని సమీర్ అన్నారు. '26 ఏళ్లుగా ఈజీఎం జరగినట్టు.. చరిత్రలో లేదు అని నరేష్ అంటున్నారు. ఇన్నేళ్లుగా ఇలాంటి ప్రెసిడెంట్‌ను 'మా' చూడలేదు. అందుకే ఈసారి ఈజీఎం పెట్టాల్సి వస్తుంది' అని సమీర్ తన అభిప్రాయాన్ని మీడియాకి తెలిపారు. మరి 'మా' లో ఈ రచ్చలు ఇంకా ఎన్నాళ్ళు అని కొందరు ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటున్నారు. వీటికి పరిష్కారం లేదా అని మాట్లాడుకుంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: