మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో వివాదాల వేడి చల్లారడం లేదు.  నరేష్, జీవితా రాజశేఖర్ ల మధ్య విభేదాలు, ఆరోపణలు  తీవ్రస్థాయికి చేరుకున్నాయి.  కొన్ని రోజుల క్రితం ఈ వివాదంపై జీవిత మీడియా ముందు వివరణ ఇవ్వగా తాజాగా దానిపై స్పందించిన  నరేష్ చిరంజీవి హయాంలో రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించి తిరిగి ఈ వివాదానికి వేడి రగిల్చారు. దీంతో ఈసారి జీవితతో పాటు పాటు మరోనటి హేమ మీడియా ముందు తమ వాదనను వినిపించారు. 


మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొత్తం 26 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 16 మంది ఒక గ్రూపులో ఉండగా.. ఎనిమిది మంది ఉన్న గ్రూపు నుంచి అధ్యక్షుడిగా నరేష్ కొనసాగుతున్నారు.  యూనియన్ కు సంబంధించిన విషయాలపై కమిటీలో చర్చలు లేకుండా ఏకపక్షంగా తనకు తోచిన విధంగా నరేష్ నిర్ణయాలు తీసుకుంటున్నారని జీవిత తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్టుగా సంతకాలు తాము చేయలేమని ఆమె పేర్కొన్నారు. 


 ఇటీవల యూనియన్ లో ఏర్పడిన  అంతర్గత విభేదాలు పరిష్కరించుకోవడం కోసమే  16 మంది సభ్యులు సంతకాలు పెట్టడంతో తాను సమావేశం ఏర్పాటు చేశానని.. దానికి హజరుకాకుండా ఇప్పుడు నరేష్ తమపై ఆరోపణలు చేస్తున్నారని జీవిత వెల్లడించారు. మెజార్టీ సభ్యుల అంగీకారం మేరకే తాను నడుచుకున్నానని ఆమె స్పష్టం చేశారు. అటు ఇటీవల పెన్షనర్ డే సందర్భంగా  ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈసీ మీటింగ్ నిర్వహించారని నరేష్ అనడాన్ని ఆమె తప్పుపట్టారు.  ఎలక్షన్ డేట్ విషయంలో గందరగోళం చేసి జూలైలో జరగాల్సిన ఎన్నికలను సెప్టెంబర్ కు మార్చిన నరేష్.  అప్పుడు లేని రాజ్యాంగ మార్పు గురించి ఇప్పుడు మాట్లాడటేమిటి?  రాజ్యాంగాన్ని మారుస్తారా అని ప్రశ్నించడం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.


 గత ఆరునెలలుగా నరేష్ తీరుపై మా సభ్యుల్లో అసహనం పెరుగుతోందన్న జీవిత.. తాము నిర్వహించిన సమావేశంపై ఏమైనా అభ్యంతరాలుంటే కమిటీ ముందుకు తీసుకెళ్లాలి కానీ ఆయనకు తోచిన విధంగా ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. కాగా మా లో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలకు పరిష్కారం కోసం కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు, మాజీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: