దక్షిణాది సినిమా రంగాన్ని ఒక మలుపు తిప్పి 1970 నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన కె. బాలచందర్ ఈరోజు సాయంత్రం 7.05 నిముషాలకు సినిమా ప్రియులందర్నీ శోక సముద్రంలో ముంచెత్తి వేస్తూ సుదూర తీరాలకు వెళ్ళిపోయారు. గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలచందర్ చెన్నైలోని కావేరి హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్న విషయం తెలిసిందే. 1965 లో సినిమా రంగ ప్రవేశం చేసిన బాలచందర్ మొదట రచయితగా తన ప్రస్థానం ప్రారంభించి 101 సినిమాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడు బాలచందర్. 9 ఫిలిం ఫేర్ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు ప్రతిభను వరించాయి.  కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఎన్నో గొప్ప చిత్రాలు నిర్మించిన ఘనత బాలచందర్ సొంతం. మరోచరిత్ర, ఆకలి రాజ్యం, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, కోకిల, రుద్రవీణ లాంటి ఎన్నో గొప్ప సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు బాలచందర్. రజనీకాంత్, కమలహాసన్, ప్రకాష్ రాజ్ లాంటి ఎందరో నటులకు నటనకు సంబంధించి తొలి పాఠాలు నేర్పడమే కాకుండా వారిని సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత బాలచందర్ ప్రతిభకు తార్కాణం.  కమలహాసన్ అతి కష్టం మీద బాలచందర్ ను ఒప్పించి చాలాకాలం తరువాత నటింప చేసిన ‘ఉత్తమ విలన్’ విడుదల కాకుండానే ఆయన చనిపోవడం కమల్ హాసన్ కు షాక్. రజినీకాంత్ కమలహాసన్ లతో బాలచందర్ కు ఉన్న అనుభందం తండ్రి కొడుకుల అనుభందానికి మించినది. భారతదేశ సినిమా రంగ చరిత్రలో బాలచందర్ స్థానాన్ని ఎవరూ పూరించలేరు అన్నది వాస్తవం..

మరింత సమాచారం తెలుసుకోండి: