ఒకప్పటి సినీ ప్రముఖులు రాస్తున్న పుస్తకాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆ మధ్య ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి రాసిన ఆటోబయోగ్రఫీ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది. అందులో ఆయన ఎంతో మంది గురించి ఉన్నది ఉన్నట్టు రాసి ఏకిపారేశారు. ఆ పుస్తకం మార్కెట్ లో లేకుండా చేశారు. తాజాగా అలాంటి ప్రకంపనలు సృష్టించడానికి మరో పుస్తకం మార్కెట్ లోకి వస్తోంది. సీతామహాలక్ష్మి, గోరింటాకు, జానకిరాముడు వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించిన యువచిత్ర అధినేత మురారి తన స్వీయ అనుభవాలకు 'నవ్విపోదురుగాక' అనే పేరుతో పుస్తక రూపాన్ని ఇచ్చాడు. ఇందులో పలు సంచలనాత్మక విషయాలను ఆయన ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు పెద్దల తెరచాటు భాగోతాలను బట్టబయలు చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ పుస్తకావిష్కరణ శనివారం చెన్నైలో జరగనుంది. ఈ పుస్తకం ఆవిష్కరణకు ముందే ఈ పుస్తకంలో ఆయన రాసిన కొన్ని విషయాలు బయటకి వచ్చేశాయి. మెగాస్టార్ చిరంజీవిపై కూడా తన అభిప్రాయాన్ని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అందంగా సాగిపోతోన్న తెలుగు సినిమా పాటను 'ఖైదీ' సినిమాతో చిరంజీవి బ్రష్టు పట్టించాడని ఆయన ఈ పుస్తకంలో రాసుకున్నాడు. ఇక 'జానకి రాముడు' సినిమా షూటింగ్ జరుగుతూ వుండగా సాయంత్రమయ్యే సరికి హీరో ఓ హీరోయిన్ తో, దర్శకుడు మరో హీరోయిన్ తో అక్కడి నుంచి చెక్కేసేవారని ఆయన రాశారు. రాఘవేంద్రుడే నా పతనేంద్రుడు అంటూ మరో బాంబ్ పేల్చారాయన. ఇక సంగీత దర్శకుడు చక్రవర్తికి స్వరాలే రావంటూ ఝలక్ ఇచ్చాడు. ఎవరినీ నొప్పించడం కోసం తాను ఈ పుస్తకం రాయలేదనీ, ఓ నిర్మాతగా తాను పడిన ఇబ్బందులను.. బాధలను ఆవిష్కరించడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు. ఆ పుస్తకాన్ని విడుదల చేయవద్దని చాలా మంది మురారిని వేడుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరిని నొప్పించలేక 15 పేజీలు తీసేసినట్టు మురారి చెబుతున్నారు. అయితే, ఉత్తమ చిత్రాల కోసం, విలువలతో కూడిన సినిమా నిర్మాణం కోసం పరితపించే మురారి కాస్త తిక్క మనిషి. ఎవర్నీ కేర్ చేయని తత్త్వం ఆయనది. మొత్తానికి టాలీవుడ్ లో ఈ పుస్తకం తీవ్ర ప్రకంపనలు సృష్టించడం ఖాయమనీ అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: