అమెరికాలో హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారుల జీవితభాగస్వాముల్లో వారి భవితవ్యంపై ఆందోళన, అస్పష్టత మరికొంత కాలం కొనసాగనున్నాయి. వారి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించే నిబంధనను రద్దుచేయాలా, వద్దా అనే అంశాన్ని పరిశీలించి, తమ నిర్ణయాన్ని తెలిపేందుకు గడువును సెప్టెంబరు 27 వరకు పొడిగించాలని ఓ అప్పీళ్ల కోర్టును డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం కోరింది. హెచ్‌-4 వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే. హెచ్‌-4 వీసాదారుల్లో నిర్దేశిత నిబంధనలకు లోబడిన వారికి ఉద్యోగాలు చేసుకునేందుకు 2015లో బరాక్‌ ఒబామా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.



నాటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ఉద్యోగుల బృందం ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’ దిగువ కోర్టుకు వెళ్లగా, బృందం వ్యాజ్యాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. తర్వాత ఈ బృందం డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని పరిశీలించి, తమ వైఖరి తెలపడానికి ట్రంప్‌ ప్రభుత్వం గతంలో న్యాయస్థానాన్ని 60 రోజుల గడువు కోరింది. అది సోమవారం(ఈ నెల 10)తో ముగియాల్సి ఉంది. అయితే ఈ కేసుపై విచారణ ప్రక్రియను ఆరు నెలలు నిలిపివేయాలంటూ న్యాయశాఖ కొద్ది రోజుల కిందట కోర్టును కోరింది. ఈలోగా హెచ్‌-4 వీసాదారులను ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించే నిబంధనను చురుగ్గా పునఃపరిశీలిస్తామని తెలిపింది.


Image result for visa

ఈ అంశంపై న్యాయశాఖ అధికార ప్రతినిధి సారా ఇస్గుర్‌ ఫ్లోర్స్‌ మీడియాతో మాట్లాడుతూ- చట్ట ప్రకారం అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక గురించి వెల్లడించలేదు. కేసులో మరింత జాప్యం తగదంటూ సర్కారు తీరును ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’ బృందం ఆక్షేపించింది. సాధ్యమైనంత త్వరగా మౌఖిక వాదనలను మొదలుపెట్టాలని కోరుతూ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసింది. ఈ అంశంలో ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రభుత్వం సమర్థించే అవకాశాలు తక్కువేనని వలసదారుల మద్దతుదారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: