అబ్బాయి న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి పెళ్లి చేశారు. పెళ్లైన 40 రోజులకే భార్యని మెట్టినింట్లో వదిలి న్యూజిలాండ్‌ వెళ్లిపోయాడు. మధ్యలో ఓసారి చుట్టపుచూపుగా వచ్చి భార్యను పలకరించి వెళ్లిపోయాడు. మళ్లీ అతని ఆచూకీ లేదు. ఇదేంటని ఆ యువతి అత్తింటివారిని అడిగితే.. ‘వాడిని ఎప్పుడో వదిలేశాం. ఇక నీకూ ఇక్కడ ఉండాల్సిన పనిలేదు వెళ్లిపో’ అని గెంటేశారు. అటు భర్త జాడ తెలీక ఇటు అత్తామామలు చేరదీకపోవడంతో ఆమె కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ సాయం కోరింది. అతన్ని ఎలాగైనా న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు రప్పించాలని వేడుకుంది. భార్యను వదిలేయాలనుకునే ఇలాంటి ఎన్నారైలకు బుద్ధి చెప్పాలని కోరుతోంది పంజాబ్‌కి చెందిన చాంద్‌దీప్‌ కౌర్‌.



చాంద్‌దీప్‌కి పంజాబ్‌కి చెందిన రమణ్‌దీప్‌తో 2015లో వివాహం జరిగింది. రమణ్‌దీప్‌ న్యూజిలాండ్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయ్యాక న్యూజిలాండ్‌ వెళ్లిన రమణ్‌దీప్‌ భార్య చాంద్‌దీప్‌తో మాట్లాడడం మానేశాడు. దాంతో చాంద్‌దీప్‌ 2016లో భర్తపై పంజాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు రమణ్‌దీప్‌ భారత్‌కు రాకపోవడంతో త్వరగా న్యూజిలాండ్‌ నుంచి తన భర్తను రప్పించాలని.. అతనికి విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నానని చాంద్‌దీప్‌ కేంద్రమంత్రి సుస్మాస్వరాజ్‌కు తన కథంతా ట్విట్టర్‌ ద్వారా వివరించింది. దీనిపై స్పందించిన సుష్మాస్వరాజ్‌.. కేసుకు సంబంధించిన పత్రాలను తనకు మెయిల్‌ చేయాలని సూచించారు. ఈ కేసులో ఇప్పటికే పంజాబ్‌ పోలీసులు రమణ్‌దీప్‌పై పీవో జారీచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: