దుస్తులు కొందామని వెళ్లిన మహిళకు ఊహించని సంఘటన ఎదురైంది. ఎన్నో షాపులు తిరిగి తనకు నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకుని ఒక్కసారి వేసుకుని చూద్దామని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ఆమెకు సడన్ షాక్ తగిలింది. ఓ ఆగంతకుడు తనను సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరిస్తున్నాడని తెలుసుకుని అత్యంత వేగంగా స్పందించింది. దుబాయిలోని ఓ వస్త్ర దుకాణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దుబాయికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళ నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణానికి వెళ్లింది.



తనకు కావాల్సిన దుస్తులు తీసుకుని ట్రయల్ రూమ్‌కు వెళ్లింది. అయితే దుస్తులు మార్చుకుంటుండగా డోర్‌కు ఓ రంద్రాన్ని గమనించింది. దాంట్లో నుంచి సెల్‌ఫోన్ కెమెరా కనిపించడంతో వెంటనే బయటకు దూసుకు వచ్చిందామె. అక్కడే ఉన్న ఓ పాతికేళ్ల యువకుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుకాణానికి వచ్చిన చాలామంది మహిళల పట్ల అతడు ఇలాగే ప్రవర్తించాడని తేలింది. ఫిబ్రవరి నెలలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన కేసు మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో యువకుడిని న్యాయమూర్తి దోషిగా తేల్చారు. తుది తీర్పును దుబాయి కోర్టు జూన్ 11న వెలువరించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: