అమెరికాలో తమ భద్రతపై భారత విద్యార్థులు ‘‘తీవ్ర ఆందోళన’’ పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆరు ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలకు ఆ దేశ సుప్రీం కోర్టు తాత్కాలికంగా మద్దతు పలకడంతో... ఈ ఆందోళన మరింత ఎక్కువైనట్లు వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ) ఈ అధ్యయనం నిర్వహించింది. దేశంలో పది లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. వీరు దేశ ఆర్థిక వ్యవస్థకు 36 బిలియన్ల డాలర్లు(రూ.2.3 లక్షల కోట్లు)కుపైగా తోడ్పడుతున్నట్లు వివరించింది. ముఖ్యంగా పశ్చిమాసియా విద్యార్థుల విషయంలో విద్యా సంస్థలు ఎక్కువగా ఆందోళన పడుతున్నట్లు పేర్కొంది. ‘



తమ ప్రవేశాలకు సమ్మతి తెలిపిన పశ్చిమాసియా విద్యార్థుల్లో చాలామంది క్యాంపస్‌లలో అడుగుపెట్టకపోవచ్చని 31 శాతం విద్యా సంస్థలు కలవరపడుతున్నాయి. భారత విద్యార్థులూ రారేమోనని 20 శాతం సంస్థలు ఆందోళన పడుతున్నాయి’అని ఐఐఈ వివరించింది. ‘భద్రత, వీసాల గురించి విద్యార్థులు ఎక్కువగా ఆందోళన పడుతున్నట్లు 46 శాతం విద్యా సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా భారతీయులు వ్యక్తిగత భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు 80 శాతం సంస్థలు వివరించాయి. తమకు అమెరికా ఆహ్వానం పలుకుతున్న తీరుపైనా విద్యార్థులు కలవరపడుతున్నట్లు 30 శాతం సంస్థలు వెల్లడించాయి’అని ఐఐఈ వెల్లడించింది. ‘భద్రతపై విద్యార్థుల ఆందోళనలు చూస్తుంటే.. ఉన్నత విద్య కోసం అమెరికాకువచ్చే భారతీయుల సంఖ్య తగ్గే అవకాశముంది.’ అని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: