అమెరికాలోని తెలుగు వారంద‌రిని క‌లిచివేసిన ఘోర సంఘ‌ట‌న వెనుక అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అయోవాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ సుంకర కుటుంబం అనుమానాస్పద మరణాల వెనుక మిస్టరీ వీడింది. చంద్రశేఖర్ తన భార్య లావణ్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు వెస్ట్ డెస్‌మోయిన్స్ పోలీసులు సోమవారం వివరాలు వెల్లడించారు. నూత‌న గృహ‌ప్ర‌వేశం సంద‌ర్భంగానే ఈ ఘ‌టన చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 


ఏపీకి చెందిన చంద్రశేఖర్ కుటుంబం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. వారంతా తుపాకీ కాల్పుల్లో మృతిచెందినట్టు గుర్తించినా.. హత్యో, ఆత్మహత్యో తేలలేదు. సోమవారం వెల్లడైన పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం చంద్రశేఖర్ సుంకర (44) ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన భార్య లావణ్య (41), ఇద్దరు కొడుకులు ప్రభాస్ (14), సుహాస్ (11) తుపాకీ కాల్పుల్లో మృతిచెందారని తేలింది. దీంతో చంద్రశేఖర్ ముందుగా తన భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసి, ఆ తర్వాత తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. 


చంద్రశేఖర్‌ది ఏపీలోని గుంటూరు జిల్లా చుండూరు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తకోటకు చెందిన లావణ్యతో 2003లో వివాహం జ‌రిగింది. తర్వాత రెండేళ్ల‌కే వీరిద్దరూ అమెరికా వెళ్లిపోయారు. చంద్రశేఖర్ ప్రస్తుతం అయోవా ప్రజా భద్రతా విభాగంలో (డీపీఎస్) ఐటీ నిపుణుడిగా 11 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. లావణ్య కొన్నాళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నారు. ఆమె సోదరి సైతం అమెరికాలోనే స్థిరపడ్డారు. చంద్రశేఖర్ ఈ ఏడాది మార్చిలో అయోవాలోని వెస్ట్ డెస్‌మోయిన్స్‌లో ఓ ఇల్లు కొనుక్కున్నారు. శనివారం గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లావణ్య తల్లిదండ్రులు సీతారామిరెడ్డి, హైమావతి కూడా వెళ్లారు. గృహ ప్రవేశం అనంతరం అందరూ కలిసి సమీపంలోని ఓ హోటల్‌లో విందు ఆరగించారు.


అనంతరం చంద్రశేఖర్ కుటుంబంతోపాటు లావణ్య తల్లిదండ్రులు, ఆమె సోదరి ఇద్దరు పిల్లలు కలిసి ఇంటికి వచ్చారు. ఎవరిగదిలో వారు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా భారీ శబ్ధాలు వినిపించాయి. దీంతో సీతారామిరెడ్డి బయటికి వచ్చి చూడగా అల్లుడు చంద్రశేఖర్ కనిపించారు. ఏమయిందని ప్రశ్నించగా.. పిల్లలు పడుకున్నారో లేదో చూడటానికి వచ్చానని బదులిచ్చాడు. ఆ తర్వాత కొంత సేపటికి మళ్లీ శబ్ధాలు వినిపించాయి. దీంతో సీతారామిరెడ్డి తన మనుమలు ఉన్న గదికి వెళ్లి చూడగా వారిద్దరితోపాటు చంద్రశేఖర్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. పక్కనే బాల్కనీలో లావణ్య మృతదేహం పడి ఉన్నది. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీతారామిరెడ్డి.. వెంటనే పెద్దగా కేకలు వేస్తూ సహాయం కోసం బయటికి పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమచారం అందించారు. చంద్రశేఖర్ కొన్నాళ్లుగా మానసిక ఒత్త్తిడితో బాధపడుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఆయన పెద్ద కొడుకు కూడా కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు. చంద్రశేఖర్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో తుపాకీ లైసెన్స్ ఇచ్చినట్టు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: