అమెరికా అబ్బాయి.. పాలమూరు అమ్మాయి నిన్న పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ప్రేమకు ప్రాంతం, కులం, మతం ఏమి లేవని ఈ ప్రేమజంట మరోసారి నిరూపించింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరుకు చెందిన వర్షిణి అనే యువతీ, యూఎస్‌లోని డల్లాస్‌కు చెందిన హెన్రీ హుడ్ గిన్స్ అనే యువకుడు నిన్న హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లిచేసుకొని ఒకటయ్యారు. 


హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన వర్షిణి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి కాగానే డల్లాస్‌లోని క్యాపిటల్ వన్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న హెన్రీ హుడ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. 


ఈ విషయాన్ని ఇరు కుటుంబాలకూ తెలపగా వారు మొదట నిరాకరించినప్పటికీ చివరికి ఈ పెళ్లికి అంగీకరించారు. దీంతో సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికా అబ్బాయి.. పాలమూరు అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వరుడు హెన్రి తరఫున బంధువులు, స్నేహితులు హాజరు కాగా ఈ పెళ్లికి స్పెషల్ గెస్టుగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: