పల్లెటూర్లలో పశువుల పేడతో తయారు చేసే పిడకల గురించి అందరికి తెలిసే ఉంటుంది. గ్రామాల్లో పొయ్యిలో నిప్పు ఆరిపోకుండా, మట్టి పొయ్యిలో వంటలు  చేసేందుకు కూడా వీటిని ఉపయోగిస్తారు. అలాగే, హోమాలు తదితర పూజా కార్యక్రమాలకు, శ్మశానాల్లో అంత్యక్రియల కోసం పిడకలు వాడుతుంటారు. 


దీంతో వీటికి ఇండియాలో మంచి డిమాండే ఉంది. సిటీల్లో ఇవి దొరకడం కష్టమైనా.. పక్కనే ఉండే గ్రామాల్లోకి వెళ్లి కొనుగోలు చేసుకుని తెచ్చుకొనే వీలు ఉంటుంది. మరి, అమెరికా వంటి దేశాల్లో పిడకలు కావాలంటే ఎలా...?? అందుకే, అక్కడ ఓ షాపింగ్ మాల్‌లో స్నాక్స్ తరహాలో ప్యాకెట్లలో పెట్టి మరీ అమ్మేస్తున్నారు. ఇటీవల అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో కూడా పిడకలు అందుబాటులోకి వచ్చాయి. 


అయితే, షాపింగ్ మాల్‌లో పిడకలు అమ్మడం మాత్రం ఇదే తొలిసారి కావచ్చని తెలుస్తోంది. అమెరికాలో ఉండే భారతీయ హిందువుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ ప్యాకెట్లో మొత్తం 10 పిడకలు ఉన్నాయి. ఈ పిడకల వెల 2.99 డాలర్లే (రూ.214) అని పేర్కొన్నారు. అయితే, ఇవి తినడానికి కాదని, ఆధ్యాత్మిక అవసరాలకేనని ప్యాకెట్‌పై హెచ్చరించారు ఆ షాపింగ్ మాల్‌ ఓనర్స్.


సమర్ హలార్నకర్ అనే ట్విట్టర్ యూజర్ పిడకల ప్యాకెట్ ఫొటోను పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. న్యూజెర్సీలో ఉంటున్న తన కజిన్ ఈ ఫొటోను పంపాడని, ఎడిసన్‌లోని కిరణా స్టోర్‌లో పిడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. చివర్లో అతడు చిన్న అనుమానం కూడా వ్యక్తం చేశాడు. వాటిని ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న ఆవు పేడతో తయారు చేశారా లేదా అమెరికాలో ఉండే యాంకీ కౌ పేడతో తయారు చేశారా అని అడిగాడు. దీనిపై నెటిజనులు భలే ఫన్నీగా స్పందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: