యూఏఈలో గత రెండు రోజులుగా 15 ఏళ్ల భారత సంతతి బాలుడు ట్యూషన్‌కని వెళ్లి కనిపించకుండా పోయాడు. శుక్రవారం ఉదయం నుంచి పత్తాలేకుండా పోయాడని, తమ కుమారుడు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తల్లిద్రండులు అక్కడి స్థానికులను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. షార్జాలో ఉండే భారత దంపతులు సంతోష్ రాజన్, బిందు సంతోష్‌ల కుమారుడు అమేయా సంతోష్(15). షార్జాలోని ఓ ఇండియన్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు షార్జాలోని అబూ షగరలో ట్యూషన్ సెంటర్ వద్ద బాలుడిని తండ్రి వదిలేసి వెళ్లాడు. 

అనంతరం మధ్యాహ్నాం సమయంలో ట్యూషన్ టీచర్ నుంచి సంతోష్ రాజన్ మొబైల్‌కు అమేయా ట్యూషన్ క్లాస్‌కు రాలేదని మెసేజ్ వచ్చింది. దాంతో వెంటనే ట్యూషన్ సెంటర్ వద్దకు వెళ్లిన రాజన్ అక్కడి వారిని తన కుమారుడి గురించి వాకాబు చేశాడు. దంపతులిద్దరూ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయిన అమేయా జాడ మాత్రం దొరకలేదు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు వెతకని చోటు అంటూ లేదు. 

తమ కుమారుడి జాడ తెలిస్తే చెప్పండంటూ అక్కడి స్థానికులను వేడుకుంటున్నారు. అమేయా ట్యూషన్‌కు వెళ్లినప్పుడు చిలక పచ్చ రంగు టీషర్ట్, నేవీ బ్లూ ప్యాంట్ ధరించాడు. అతని చేతి మణికట్టుకు నల్ల దారం ఉంది. ఇంట్లోంచి వెళ్లేటప్పుడు అతని వద్ద కేవలం 10 దిర్హామ్స్ మాత్రమే ఉన్నాయని తల్లి బిందు చెప్పింది. మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన అమేయా కనిపించకుండా పోయిన తర్వాత నుంచి దానిని స్వీచ్చాఫ్ చేసేశాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

అయితే, అమేయా రాబోయే పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ గురించి గత కొన్ని రోజులుగా బాగా ఒత్తిడికి గురవుతున్నట్లు రాజన్ దంపతులు తెలిపారు. సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలకు తాను సరిగ్గా చదవలేక పోతున్నానని కొన్ని రోజులుగా అమేయా బాగా డిస్టర్బ్‌గా ఉన్నాడని వారు పేర్కొన్నారు. అందుకే అతడ్ని ఎక్స్‌ట్రా క్లాసుల కోసం ట్యూషన్‌కు పంపిస్తున్నారు. పరీక్ష ఒత్తిడితోనే అమేయా పారిపోయి ఉంటాడని దంపతులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా అమేయా జాడ కోసం షార్జా, దుబాయిలో బిందు, రాజన్ కలియ తిరుగుతున్న ఫలితం లేకుండా పోయింది. కుమారుడి రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని రాజన్ దంపతులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: