అమెరికాలో హవాయి ప్రాంతంలోని పెరెల్‌ హార్బర్‌ నేవీ షిప్‌యార్డ్‌లో ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడిన సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్‌ మార్షల్‌ రాకేశ్ కుమార్‌ సింగ్‌ భదౌరియా బృందం కూడా అక్కడే ఉంది, కానీ  త్రుటిలో ప్రమాదం నుండి  వారంతా సురక్షితంగా బయటపడినట్లు ఐఏఎఫ్‌ వెల్లడించింది. అదే సదస్సు కి హాజరైన మరో 20 దేశాల చీఫ్స్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. వారెవరికీ  ఏ ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. 

స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతం లో ఈ ఘటన చోటు చేసుకుంది. నేవీ బేస్‌లోకి చొరబడిన ఓ ఆగంతకుడు అక్కడి సిబ్బంది పై తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో డిఫెన్స్‌ సివిలియన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు గాయపడగా, వీరిలో ఇద్దరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిందితుడి కూడా అమెరికా నౌకాదళానికి చెందిన నావికుడే కావడం గమనార్హం. పెరెల్ హార్బర్‌లోని ఎయిర్‌బేస్‌‌లో ఇండో-పసిఫిక్ ప్రాంత ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్స్‌ సదస్సు జరుగుతోంది. 

ఈ సదస్సులో భారత్‌ నుంచి చీఫ్‌ మార్షల్‌ భదౌరియా సహా వాయుసేన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  పెరెల్ హార్బర్‌ అమెరికాలో అత్యంత లోతైన నౌకాశ్రయం. ఇది అమెరికా పసిఫిక్ నౌకాదళం ప్రధాన కార్యాలయం. ఇక్కడ 15 జలాంతర్గాములు, 10 నౌకవిధ్వంసక వాహనాలు ఉంటాయి. అంతేకాదు, 1941 డిసెంబరు 7న జపాన్ ఈ హార్బర్‌పై దాడిచేయడంతోనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ దాడిలో 2,300 మందిపైగా చనిపోయారు.పెరల్ హార్బర్‌పై దాడి ఘటనకు వచ్చే శనివారంతో (డిసెంబరు 7) 78 ఏళ్ల పూర్తికానున్నాయి.  

హవాయ్ గవర్నర్ డేవిడ్ జే మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఫెడరల్ ఏజేన్సీను ఉపయోగించుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారని, ఎలాంటి సాయమైనా చేస్తామని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: