మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఇప్ప‌టికే వేల‌మంది ప్రాణాల‌ను హ‌రించింది. ల‌క్ష‌ల మంది వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. ఈ వైర‌స్‌తో ప్రాణాలు క‌ల్పోయిన వారిలో ఎంద‌రో ప్ర‌ముఖులు కూడా ఉంటున్నారు. ఇప్పుడు..  ప్రపంచ ప్రఖ్యాత చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌(59) క‌రోనా వైర‌స్‌తో మృతి చెందారు. మార్చి 18న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో కొన్ని రోజులుగా న్యూజెర్సీలోని మౌంటేన్‌సైడ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న హంగర్‌ ఐఎన్‌సీ. హాస్పిటాలిటీ సంస్థ ధ్రువీకరించింది. 

 

* చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాం* అని సంస్థ‌ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. ఫ్లాయిడ్ కార్డోజ్‌కు భార‌త్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయ‌న‌ బాంబేలోనే జ‌న్మించారు. ఆయ‌న మొద‌ట‌ బయోకెమిస్ట్‌గా శిక్షణ పొందారు. అనంతరం తన అభిరుచికి అనుగుణంగా చెఫ్‌గా మారారు. అనంత‌రం భారత్‌, స్విట్జర్లాండ్‌లో శిక్షణ పొందిన ఫ్లాయిడ్ కార్డోజ్‌ న్యూయార్క్‌లో స్థిర‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌పంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ప్రఖ్యాత.. *టాప్ చెఫ్‌ మాస్టర్‌* టైటిల్‌ను కూడా ఆయ‌న సొంతం చేసుకున్నారు.

 

కాగా, ఆయ‌న మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. భారత సంతతికి చెందిన మరో సెలబ్రిటీ చెఫ్‌ పద్మా లక్ష్మి సంతాపం వ్య‌క్తం చేశారు. *ఫ్లాయిడ్‌ మనల్నందరినీ గర్వపడేలా చేశారు. న్యూయార్క్‌ వాసులు ఆయన చేతి రుచికరమైన భోజనాన్ని ఎన్నడూ మరచిపోలేరు. తన చిరునవ్వుతో చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచేవారు. ఆయన మరణం తీరని లోటు*అని విచారం వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఫ్లాయిడ్ కార్డోజ్‌ మృతికి సంతాపం తెలిపింది. న్యూయార్క్‌లో క్యాన్స‌ర్‌కు చికిత్స పొందుతున్న స‌మ‌యంలో నటుడు రిషీ కపూర్‌ ఫ్లాయిడ్‌ చేతి వంటను రుచిచూశారు. ఇప్పుడు ఆయ‌న సంద‌ర్భాన్ని ఆయ‌న గుర్తుచేసుకున్నారు. రాహుల్‌ బోస్‌, సోనం కపూర్‌తోపాటు ప‌లువురు   ఫ్లాయిడ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: