కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా అగ్ర రాజ్యం అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కాటుకి అమెరికా గజగజా వణుకుతోంది. నిన్న ఒక్కరోజే 16,000 కొత్త కేసులు నమోదు కావడంతో అమెరికాలో పరిస్థితి అదుపు తప్పిందనే వార్తలు వస్తున్నాయి. చైనా, ఇటలీ దేశాలను మించిపోయేలా అమెరికాలో కేసులు నమోదవుతున్నాయి. 
 
మరణాల సంఖ్యలో చైనా, ఇటలీలతో పోలిస్తే తక్కువగానే ఉన్నా ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం అమెరికాను భయపెడుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో పోలిస్తే అమెరికాలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చైనా కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తప్పు లెక్కలు చెబుతోందని ఆరోపణలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ కిట్ లు అందుబాటులో ఉండటంతో తాము సరైన లెక్కలు చెబుతున్నామని అన్నారు. 
 
నమోదైన కేసుల్లో 55 శాతం న్యూయార్క్ లోనే నమోదు కావడం గమనార్హం. అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో న్యూయార్క్ లో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకూ కరోనా భారీన పడి 1500 మంది మృతి చెందారు. అమెరికా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో అమెరికా వ్యాపార వర్గాలకు, ప్రజలకు ఊరట కలిగించేలా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కరోనా వైరస్ అంతం కాకపోతే అమెరికా భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుందనడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: