యూకేలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. పది రోజుల క్రితం భారత్ కు వచ్చేందుకు హీత్రూ ఎయిర్ పోర్టుకు 70 మంది విద్యార్థులు వచ్చారు. విమాన సర్వీసులను కేంద్రం రద్దు చేయడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. తొలి నాలుగు రోజులు భారత రాయబార కార్యాలయం అధికారులు విద్యార్థులకు బస, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించారు. అనంతరం విద్యార్థులను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఐదు రోజుల నుండి తిండి లేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. 
 
వెనక్కు వెళ్లటానికి వీలు లేకపోకడం... ఎయిర్ పోర్టులోకి అనుమతించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీ, తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి విద్యార్థులు ప్రభుత్వాలు తమకు భారత్ కు రావడానికి సహాయం చేయాలని కోరుతున్నారు. వీరిలో దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
విద్యార్థులు అక్కడ చిక్కుకుపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నారు. అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో భారత రాయబార కార్యాలయం కూడా తమకు సహాయసహకారాలు అందించలేకపోతుందని విద్యార్థులు చెబుతున్నారు. తాము ఇక్కడ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని విద్యార్థులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 
 
అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎయిర్ పోర్టులో చిక్కుకుపోవడంతో కేంద్రం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. తమకు తల దాచుకోవడానికి కూడా స్థలం లేదని వారు చెబుతున్నారు. అంతర్జాతీయ విమానాలన్నీ ఆగిపోవడంతో విద్యార్థులు భారత్ కు తిరిగి రావడం అంత సులభం కాదని తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విద్యార్థులు ఇండియాకు వచ్చేలా సహాయం చేయాలని స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: