కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని, ఆర్ధిక నష్టాలని  చవిచూస్తున్నాయి. అగ్ర రాజ్యంగా విరాజిల్లే అమెరికాలో కరోనా చేస్తున్న విలయ తాండవం ఊహలకి కూడా అందనంతగా ఉంది. రోజు రోజుకి వేల సంఖ్యలో ప్రజలు మృత్యు వాతపడుతుండగా లక్షలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో అమెరికా వాసులు, అమెరికాలో ఉంటున్న వలస వాసులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అమెరికా వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు, యూనివర్సిటీలు మూసేయడంతో

 

భారతీయ విద్యార్దుల పరిస్థితి అంధకారంలో పడింది. ఎంతో మంది భారతీయ విద్యార్ధులు హాస్టళ్ళు వదిలి వేరే చోటికి వెళ్ళాసిన పరిస్థితి ఎదురయ్యింది. దాంతో అమెరికాలో ఉంటున్న హిందూ సంస్థలు భారతీయ విద్యార్ధులని ఆదుకోవడానికి ముందకు వచ్చాయి. విద్యార్ధుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ ని ఏర్పాటు చేశాయి. ఆపదలో ఉన్న వాళ్ళు 802-750-YUVA (9882) హెల్ప్ లైన్ నెంబర్ ని సంప్రదించ వచ్చునని  తెలిపాయి. ఈ సహాయక కార్యక్రమంలో హిందూ యువ, వివేకానంద హౌస్ , సేవా ఇంటర్నేషనల్ హిందూ సంస్థలు అన్నీ కలిసి కోవిడ్ 19 స్టూడెంట్ సపోర్ట్ నెట్ వర్క్ ని ప్రారంభించాయి.

 

ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఆపదలో ఉన్న భారతీయ విద్యార్ధులు ఎవారైనా తమ సందేహాలని తీర్చుకోవచ్చని, వివిధ రంగాలలో నిపుణులు వారికి అందుబాటులోకి వస్తారని, ఇమ్మిగ్రేషన్ నుంచే ఎలాంటి విషయాలపై అయినా పూర్తి సమాచారం అందుతుందని ప్రకటించారు. నివాసం లేనివారికి ఉండటానికి ఆశ్రయం , సరుకులు కూడా అందిస్తామని తెలిపారు. ఇదిలాఉంటే ఈ సంస్థలని నడుపుతున్నది 90 మంది భారతీయ విద్యార్ధులు కావడం గమనార్హం. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా పలు హోటల్స్, భారతీయ విద్యార్ధులకి వసతి కల్పించేలా ముందుకు వచ్చాయి.. మరికొంత మంది భారతీయులు తమ ఇళ్ళలో విద్యార్ధులకి ఆశ్రయం కలిపిస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: