కరోనా ఎఫెక్ట్ కారణంగా దేశవిదేశాల్లో ఎంతోమంది భారతీయులు చిక్కుకుపోయారు. వారు తిరిగి స్వదేశానికి వద్దామని ప్రయత్నిస్తున్నా, అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి వారి నుంచి ఎక్కువ స్థాయిలో విజ్ఞప్తులు వస్తుండడంతో భారత్ స్పందించింది. అమెరికా , యూరోపియన్ దేశాలలో చిక్కుకున్న భారతీయులందరిని వందే భారత్ మిషన్ తరహాలో అంతర్జాతీయ విమానాల ద్వారా తిరిగి భారతదేశానికి తీసుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు భారత విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. వందే భారత్ మిషన్ తరహా లో చార్టెడ్ విమాన సేవలకు తమ కంపెనీ అనుమతించాలంటూ, ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ సహా అనేక దేశాలను విమానయాన సంస్థలు కోరుతున్నట్లుగా పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇవి పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామంటూ వెల్లడించారు .


జూన్ 15వ తేదీన యూఎస్ రవాణా శాఖ ప్రతినిధులతో ఒక దఫా చర్చలు జరిపామని, గల్ఫ్ దేశాల నుంచి షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి పంపించాలన్న అభ్యర్ధన కూడా  పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ఈ పథకం ద్వారా మనదేశంలోని ఇతర దేశాల పౌరులను వారి వారి దేశాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు గా విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచం నలుమూలలా చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించేందుకు వందే భారత్ మిషన్ ను ప్రారంభించింది. కానీ భారత్  ప్రభుత్వం వివక్షగా వ్యవహరించిందని ఇటీవల వందే భారత్ మిషన్ ను అమెరికా అడ్డుకుంది. 


తమ విమానయాన సంస్థలకు చెందిన చార్టెడ్ విమానాల రాకపోకలను భారత్ అడ్డుకోవడం వల్ల, చార్టెడ్ విమానాల రాకపోకలపై జూలై 22 నుంచి నిషేధం అమలు అవుతుందని అమెరికా రవాణా విభాగం ప్రకటించింది. అంతేకాదు అమెరికా లో చిక్కుకుపోయిన పౌరుల తరలింపు సమయంలో అక్రమంగా టిక్కెట్లు అమ్ముకుంటున్నారని అమెరికా ఆరోపించింది.  తాజాగా భారత విమానయాన మంత్రిత్వ శాఖ అమెరికాతో చర్చలు జరిపి భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: