తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు డాలస్ వేదిక కావడంతో నాట్స్ ఈ సంబరాల కోసం తెలుగువారిని అనేక పోటీలతో సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డాలస్ లో తెలుగు మహిళలకు వంటల పోటీలు నిర్వహించింది. మహిళలు తమ పాక శాస్త్ర ప్రావీణ్యతను ప్రదర్శించే సదవకాశాన్ని కలిగించింది.  రుచికరమైన, ప్రకృతి సిద్ధమైన పదార్థాలను మాత్రమే ఈ వంటల్లో ఉపయోగించాలనే నిబంధనతో ఈ వంటల పోటీలను నాట్స్ నిర్వహించింది.


మహిళలు రకరకాల వంటలు వండి తమ రుచులతో అందరినీ ఆహా అనిపించారు. ఈ వంటల పోటీలలో  పాల్గొన్న ప్రతీ మహిళా విజేత గా గుర్తిస్తున్నట్లు ఈ పోటీల న్యాయ నిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ సంయుక్తంగా ప్రకటించారు. ఈ పోటీలలో సంజన కలిదిండి మొదటి స్థానం, రంజని రావినూతల రెండవ స్థానం, శ్రీవాణి హనుమంతు మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆపిల్ -కొబ్బరి బర్ఫీ, కిళ్ళీ కేక్, ఇండియన్ డోనట్ (బెల్లం గారె), జున్నుతో ప్రత్యేకమైన వంటలు ఇలా ఎన్నో రకాల వంటలతో పసందైన రుచులు అందరిని ఆహా అనిపించాయి.


చివరగా న్యాయనిర్ణేతల శ్రేష్ఠ విజేత స్వాతి మంచికంటి పేరును ప్రకటించారు.  తెలుగు సంబరాల్లో మహిళలు మెచ్చే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఈ సందర్భంగా నారీ సదస్సు సమన్వయకర్త రాజేశ్వరీ  ఉదయగిరి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు  నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట తదితరులు తమ సహాయ సహకారాలు అందించారు. నాట్స్ సంబరాల కమిటీ  ఈ పోటీల్లో విజేతలను ప్రత్యేకంగా అభినందించింది. మే 24 నుండి 26 వరకు  డాలస్ లోని అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని నాట్స్ జాతీయ కమిటీ, సంబరాల కమిటీ ఆహ్వానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: