అమెరికాలోని ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌) ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక వార్షికోత్సవం ఘనంగా జరిగింది. టాంటెక్స్‌ అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన స్థానిక ఇర్వింగ్‌ హైస్కూల్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాషాభిమానులు, సాహితీప్రియులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇందులో భాగంగా తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద గతంలో నిర్వహించిన పలు సాహిత్య కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్తలు తెలుగు సాహిత్యం తీరుతెన్నులపై మాట్లాడారు. అనంతరం ఫొటో కవితల పోటీ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.



సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, నేపథ్యగాయకులు సునీత, భార్గవి, దినకర్‌, యాసిన్‌ నజీర్‌, సమీర భరద్వాజ్‌ తమ పాటలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి దుర్గాభవానీ, విమర్శకుడు, కథా, యాత్ర రచయిత దాసరి అమరేంద్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ కాత్యాయని విద్మహే, విమర్శకులు వాసిరెడ్డి నవీన్‌, నాటక రచయిత కందిమళ్ల సాంబశివరావు, ప్రముఖ కథా రచయిత గొర్తి బ్రహ్మానందం, నాట్యాచార్యులు, చలనచిత్ర నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రవాస భారతీయుల ఐటీ ప్రత్యేక ప్రతినిధి మనోహర్‌ రెడ్డి, టాంటెక్స్‌ ఉత్తరాధ్యక్షలు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షులు వీర్నపు చినసత్యం తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: