శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దళ సభ్యులు  పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. చర్చిల్లో ఎంతో శక్తిమంతమైన బాంబులతో పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.ఈ దాడుల్లో 210 మందికి పైగా మరణించగా, 500 మంది తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇందులో మ‌న దేశ‌స్తులు కూడా ఉన్నారు. శ్రీలంక పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మృతి చెందినట్టు కొలంబోలోని నేషనల్ హాస్పిటల్ వర్గాల నుంచి ఇండియన్ హైకమిన్‌కు సమాచారం అందినట్టు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మృతుల పేర్లను లోకాషిని, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్‌లుగా తెలిపారు. మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు.


మ‌రోవైపు తెలుగు నేల‌కు ఓ వ్య‌క్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కొలంబోలోని షాంఘ్రిలా హోటల్‌లో పేలుడు సంభవించిన సమయంలో అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.  సురేంద్రబాబుతోపాటు అతని స్నేహితులు రాజగోపాల్, వెంకటేష్, మహీందర్ రెడ్డిలు కొలంబోకి విహార యాత్రకు వెళ్లారు. ఈ టూర్లో భాగంగా, తన స్నేహితులతో కలిసి అదే హోట‌ల్‌లో టిఫిన్‌ చేస్తున్నారు. పేలుడు సంభవించిన సమయంలో తొక్కిసలాట జరిగిందని.. తాను ఎమర్జెన్సీ గేటు నుంచి బయటపడ్డానని సురేంద్రబాబు చెప్పారు. ప్రసుత్తం తాము క్షేమంగా ఉన్నామని ఆయన ఫోన్‌ చేసి కుటుంబసభ్యులకు చెప్పారు.


కాగా, ఈ పేలుళ్ల‌లో ఓ చర్చిలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం కూడా రక్తసిక్తమైపోయింది. భక్తుల తాలూకు రక్తం, మాంస ఖండాలు ఎగిరివచ్చి ఏసు విగ్రహంపై పడ్డాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రార్థనమందిరాలు ఇప్పుడు నెత్తురోడాయి. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, ఛిద్రమైన శరీర అవయవాలు దర్శనమిస్తున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా శ్రీలంక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: