ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతి పొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వల‌స వెళ్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది అమెరికా పౌరుల వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్) వెలువ‌రించిన వివ‌రాల ప్ర‌కారం అమెరికాలో హెచ్-1బీ వీసా కలిగిన‌ ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులే. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌  నాటికి అమెరికాలో 4,19,637 మంది విదేశీయులు హెచ్-1బీ వీసాపై పనిచేస్తుండగా అందులో 3,09,986 మంది భారతీయులు ఉన్నారు. భారత్ తర్వాత అత్యధికంగా 47, 172 మంది చైనీయులు హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్నారు. అయితే, ఇంత‌టి కీల‌క వీసా విష‌యంలో ట్రంప్ సర్కారు అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌తో మ‌నోళ్ల‌కు షాక్ త‌గ‌లింది. 


తాజాగా వెలువ‌రించిన వివ‌రాల ప్ర‌కారం మునుప‌టి కంటే, 2018లో హెచ్‌1బీ వీసాల‌ జారీ 10శాతం తగ్గింది. 2018 సంవత్సరానికి గాను రెన్యూవల్స్‌ సహా కలిపి 3,35,000 హెచ్‌1బీ వీసాలను మాత్రమే మంజూరు చేశారు. ఇవే వీసాలు 2017లో 3,73,400 మంజూరు అయ్యాయి. అంటే 2017లో వచ్చిన ప్రతి 100 దరఖాస్తు 93కు ఆమోద ముద్రపడగా.. 2018 నాటికి కేవలం 85కు మాత్రమే గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. హెచ్‌1బీ వీసాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం నుంచి తీవ్ర  ఒత్తిడి ఉండటంతో జారీకి కళ్లెం వేశామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్రిగేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది.


ఇదిలాఉండ‌గా, త‌మ నైపుణ్యాల‌తో అమెరికా అభివృద్ధికి కృషిచేస్తున్న భార‌తీయుల జీవిత భాగ‌స్వామ్యులు ఉద్యోగం చేయ‌కుండా త‌గిన రీతిలో నిబంధ‌న‌ల అడ్డుక‌ట్ట వేస్తున్నారు. హెచ్‌-1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఇక్కడే ఉద్యోగం చేసుకునేలా అమెరికా తాజా మాజీ ప్రభుత్వం హెచ్‌-4 వీసా నిబంధనను తీసుకురాగా ట్రంప్‌ దీన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువరించేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: