భార‌తదేశంతో సంబంధాల విష‌యంలో  ఇటీవ‌లి కాలంలో వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్న అమెరికా తాజాగా త‌న రూటు మార్చుకుంటోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అఖండ మెజార్టీతో అధికారం చేప‌ట్ట‌డంతో...ఓవైపు త‌న విధానాల విష‌యంలో ఒత్తిడి తేవ‌డంతో పాటుగా మ‌రోవైపు స‌ఖ్య‌త‌కు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ న‌మ్మినబంటు అనే పేరున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఏకంగా బీజేపీ ఎన్నిక‌ల నినాదాన్ని ప్ర‌వచించారు.


అమెరికా భారత వ్యాపార మండలి ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లో జరిగిన ఇండియా ఐడియాస్ సమిట్‌కు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, మోదీ మరోసారి భారత ప్రధానిగా అధికారం చేపట్టిన నేపథ్యంలో భార త్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హైతో ముమ్‌కిన్ హై(మోదీ ఉంటేనే.. సాధ్యం అవుతుంది) అన్న బీజేపీ నినాదాన్ని ఆయన ఉటంకించారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో రక్షణ సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అందుకే ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని స్పష్టం చేశారు. రక్షణ ఉత్పత్తుల కోసం రష్యా, చమురు కోసం ఇరాన్, వెనెజులపై తమ స్నేహ దేశమైన భారత్ ఆధారపడకూడదని పరోక్షంగా సూచించారు.


ఈ నెల 24 నుంచి 30 వరకు తన భారత్, శ్రీలంక, జపాన్, దక్షిణ కొరియా దేశాల పర్యటన గురించి ప్రస్తావించారు. భారత్ పర్యటనలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమవుతానన్నారు.  వివిధ అంశాల‌పై చ‌ర్చిస్తామ‌ని పాంపియో వెల్ల‌డించారు. వ్యాపారం, సుంకాలు, వీసాలు స‌హా ఇత‌ర అంశాల‌పై వీరిద్ద‌రూ ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: