అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌న తెలుగోడి హ‌త్య మిస్ట‌రీ వీడ‌టం లేదు. అయోవా రాష్ట్రంలోని వెస్ట్ డెస్ మోయినెస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న చంద్రశేఖర్ సుంకర కుటుంబం ఆదివారం అనుమాన‌స్ప‌ద రీతిలో మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సుంకర చంద్రశేఖర్(44), సుంకర లావణ్య(41) దంపతులు తమ 10, 15 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కొడుకులతో త‌మ సొంత ఫ్లాట్‌లోనే తుపాకీ కాల్పుల గాయాలతో విగతజీవులుగా పడి ఉన్న‌ట్లుగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. అయితే, వీరి మ‌ర‌ణం మిస్ట‌రీ వీడ‌లేదు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు పేర్కొంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ వాసి అయిన 44 సంవ‌త్స‌రాల చంద్రశేఖర్ సుంకర అయోవా రాష్ట్ర ప్రజా భద్రతా విభాగంలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆయన భార్య లావణ్య సుంకర ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు. వారిద్ద‌రు స‌హా వారి పిల్ల‌లు త‌మ సొంత నివాసంలోనే క‌న్నుమూశార‌ని పేర్కొన్నారు. మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దవారు, ఇద్దరు పిల్లలు చంద్రశేఖర్ ఇంటిలో పేయింగ్ గెస్ట్‌లుగా ఉంటున్నారని, వారినీ ప్రశ్నిస్తున్నామన్నారు. చంద్రశేఖర్ కొన్నాళ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఆయనే కుటుంబసభ్యులను హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా, చంద్రశేఖర్ కుటుంబం అందరితో స్నేహంగా ఉండేదని వారి సన్నిహితుడు శ్రీకర్ సోమయాజుల తెలిపారు. తనకు పదేళ్లుగా వారితో అనుబంధం ఉన్నదని, వారి ఇద్దరు పిల్లలు చాలా ప్రతిభావంతులన్నారు. వారి మరణం తనను ఎంతో కలిచివేస్తున్నదన్నారు. చంద్ర‌శేఖ‌ర్ కుటుంబం ఆక‌స్మాత్తుగా క‌న్నుమూసిన ఉదంతంలో వాస్త‌వాలు వెలుగులోకి రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: