జాతి విద్వేష చ‌ర్య‌లు కావ‌చ్చు...లేదా మ‌రేదైనా కార‌ణం అయి ఉండ‌వ‌చ్చు కానీ...విదేశాల్లో ప్ర‌వాస భార‌తీయుల‌పై ఇటీవ‌లి కాలంలో దాడులు త‌ర‌చుగా చోటుచేసుకుంటున్నాయి. భార‌తీయులు ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల్లో కొన్ని సంద‌ర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్తులు న‌ష్ట‌పోతున్నారు. మరికొన్ని సంద‌ర్భాల్లో వారికి తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంది. అయితే, ఈ త‌ర‌హా స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌వాస భార‌తీయుల‌పై జ‌రిగే దాడుల విష‌యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను రంగంలోకి దింపుతోంది.


కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏను మరింత పటిష్ఠపరుస్తూ లోక్‌సభలో ఎన్‌ఐఏ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారతీయులపై, భారతీయ ప్రయోజనాలపై ప్రపంచంలో ఏ ప్రాంతంలో జరిగే ఉగ్రదాడిపైనైనా దర్యాప్తు చేసే అధికారాన్ని ఈ బిల్లు ద్వారా ఎన్‌ఐఏకు కల్పించారు. అలాగే సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా కేసులపైనా దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఐఏకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ వ్యతిరేకించారు. పెండింగ్ కేసులతో కోర్టులు ఇప్పటికే సతమతమవుతున్నాయని, ఎన్‌ఐఏ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం వాటికి మరిన్ని కేసులను జమచేస్తున్నదని ఆరోపించారు. రాజకీయ జోక్యాన్ని నిరోధించేందుకు ఈ బిల్లులో ఎలాంటి ప్రతిపాదనలు లేవని విమర్శించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న అనుమానిత నిందితుడిని కూడా ఉగ్రవాదిగా పరిగణించేందుకు వీలు కల్పించే యూఏపీఏ సవరణ బిల్లును కూడా కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: