మనం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఉపయోగిస్తాం.. ఎన్ని దేశాలు తిరిగినా పాస్‌పోర్ట్ ఒకటే ఉంటుంది.. కానీ వీసా మాత్రం దేశానికి దేశానికి మారుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసేవారి సంక్షేమం కోసం సొంతదేశాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాయి. అందులో భాగంగానే పాస్‌పోర్టును అందిస్తుంటాయి. నియంతృత్వ పోకడలు ఉన్న కొన్ని దేశాలు తప్పితే ప్రపంచంలోని చాలా వరకూ దేశాలు పాస్‌పోర్టులను అందిస్తున్నాయి. 


అయితే అన్ని దేశాల పాస్‌పోర్టులు ఒకటేనా అంటే.. కాదని కచ్చితంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ సమాజంలో తమ పౌరుల భద్రత, వారికి ప్రత్యేక గుర్తింపును కల్పించేలా కొన్ని దేశాలు పాస్‌పోర్టులను అందిస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, అత్యంత బలహీనమైన పాస్‌పోర్టులు కలిగిన దేశాల జాబితాలపై ఓ లుక్కేద్దాం... 


హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ 2019 నివేదిక ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల జాబితాలో జపాన్, సింగాపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో ఎటువంటి వీసా అక్కర్లేకుండా ఏకంగా 189 దేశాలకు వెళ్లవచ్చు. ఆ తరువాతి స్థానంలో ఫిన్లాండ్, జర్మనీలతో కలిపి సౌత్ కొరియా ఉంది. ఈ దేశాల పౌరులు ఎలాంటి వీసా అక్కర్లేకుండా ప్రపంచవ్యాప్తంగా 187 దేశాలకు వెళ్లే సౌకర్యం కల్పిస్తోంది. డెన్మార్క్, ఇటలీ, లక్సెంబర్గ్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో 186 దేశాలకు వీసా అక్కర్లేకుండా ప్రయాణం చేయగలిగేలా తమ దేశ పౌరులకు అవకాశం కల్పిస్తున్నాయి. 


ఫ్రాన్స్, స్పెయిన్, స్వీడన్ 185 దేశాలకు వీసా అక్కర్లేకుండా తమ పౌరులు స్వేచ్ఛగా వెళ్లగలిగే విధంగా పాస్‌పోర్టులను అందిస్తూ నాల్గో స్థానంలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూకే పాస్‌పోర్టులతో ఆ దేశ పౌరులు వీసా లేకుండా 183 దేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఉంది. దీంతో యూఏస్, యూకే ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈ జాబితాలో యూఏఈ గతేడాదితో పోలీస్తే ఏకంగా 20 స్థానాలు ఎగబాకి టాప్ -20లో నిలిచింది. 


14 ఏళ్ల యూఏఈ పాస్‌పోర్టు చరిత్రలో ఇదే అత్యుతమ ర్యాంక్. యూఏఈ పాస్‌పోర్టుతో మొత్తం 167 దేశాలకు వీసా అక్కర్లేకుండా ప్రయాణం చేయగలిగేలా తమ దేశ పౌరులకు పాస్‌పోర్టును అందిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే 86వ స్థానంలో ఉంది. పొరుగు దేశాలైన శ్రీలంక 99, బంగ్లాదేశ్ 101, పాకిస్తాన్ 106 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో ఆప్ఘ‌నిస్తాన్ ఉంది. ఈ దేశం అందిస్తున్న పాప్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 25 దేశాలు మాత్రమే వెళ్లే సౌకర్యం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: