దేశం కాని దేశంలో ఉన్నా తెలుగోడికి తెలుగు పండుగలంటే మక్కువ ఎక్కువే.. ఎన్ని ఇబ్బందులున్నా మన పండుగలను ఘనంగా జరుపుకోవాలనే అనుకుంటాడు. అయితే అందుకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. వాటి గురించి ఓ ఎన్నారై పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఎన్నారైల పండుగ కష్టాలకు అద్దం పడుతోంది.. ఆ పోస్టు మీ కోసం..


బాబ్బాబు... నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారూ...

“ నేను ఏ సంఘంలో సభ్యుడిని కాదు... నేను ఈ వర్గానికీ కొమ్ము కాయను. ఏదో పొట్ట కూటికోసం ఈ దేశానికి వచ్చాం. ఆ కంపెనీ వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచితే అన్నాళ్ళు ఉండేసి తట్టా బుట్టా సద్దుకొని ఎక్కడికెళ్లమంటే అక్కడ కెళ్లిపోతాం. మాకు ఈ కుల, భాషా, రాష్ట్ర సమాజాలు, వాటితో బాటు బోనస్ గా వచ్చే రాజకీయాలు అంటే పెద్దగా పడదు. అలాని ఓట్లేయం అనుకోవద్దు. నిఖార్సయిన ప్రజాస్వామ్య వాదులం. కాకపోతే దేశం వదిలేసి ఇంత దూరం వచ్చి నేను, నా మతం అనుకునే బాపతు కాదు. అలాని దేశభక్తి లేదనుకోవద్దు. ఏటా సైనిక నిధులకు మాకు తోచిన విరాళాలిస్తుంటాం.


మరింకేం... భాషా సమాజాల్లో, రాష్ట్రాల సంఘాల్లో చేరిపోవచ్చు కదా అంటారా... అక్కడికే వస్తున్నా... దేశం కాని దేశం వచ్చి పని చేస్తున్నాం అంటేనే ఆ కంపెనీ వాళ్ళు మనని పీల్చి పిప్పి చేసేంత పని అప్పగిస్తారు. పనికి తోడు ప్రెషర్... వాటికి తోడు అన్ని పనులూ మనమే చేసుకోవాలాయె. దొరికిన ఆ కొండకచో ఒకటో రెండో లీవులు ఫ్యామిలీ తో స్పెండ్ చేసేందుకే సరిపోదు. ఇంత బిజీ గా ఉంటే మధ్యలో ఓ సినిమానో, షికారో కాస్త ఆటవిడుపు. ఇక పండగలు, పబ్బాలు విషయంలో ఎక్కడికక్కడ సద్దుబాట్లే.


ఇంకా మా ఆవిడకు కాస్త చాదస్తం ఎక్కువ కాబట్టి పండుగ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ వేసుకోమని తినేస్తుంది. తూతూ మంత్రంగా జరిపించాల్సింది కాస్తా కొంచెం ఎలాబరేట్ గానే పండుగలు జరిపించేస్తుంది. అక్కడే వచ్చింది అసలు చిక్కంతా... పండగ అంటే కొత్త బట్టలేసుకోవడం, పిండి వంటలు మెక్కేయటం కాదు కదా... అసలే మన తెలుగు పండుగలు ఒక్కోదానికి ఒక్కో ప్రాశస్త్యం... ఒకదానికి వేప పువ్వంటారు, మరో దానికి పత్రి అంటారు, మరో దానికి కంద మొక్క అంటారు... మరి అవన్నీ ఇక్కడ దొరికేస్తే సమస్యేముందని... అలా కాదుగా... కొన్ని దొరికుతాయ్, కొన్ని దొరకవ్... అలాంటి వాటి కోసమే ఈ సమాజాలు సంఘాలు గుర్తు వచ్చేస్తాయి. ఫ్రీ గా ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే గొడవే లేదు... కానీ మెంబర్ అయితేనే కానీ ఇవ్వం అంటారు... అపుడే వస్తుంది చిక్కంతా...


ఏడాదికోసారి వచ్చే అవసరం కోసం మెంబరుషిప్ తీసుకోవాల్సిందేనా... డబ్బులు, డాలర్లు విషయం పక్కన పెడితే.. ఇలాంటి వాటిలో చేరకపోతే ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు మాట్లాడేస్తుంటారు జనాలు. అసలు తెలుగు వాళ్ళు అయుండి, అసలు పలానా ప్రాంతం వాళ్ళు అయ్యుండీ... చేరానంటారేమిటీ అని సన్నాయి నొక్కులు నొక్కేస్తుంటారు. అయ్యా... నువ్వు పూజకోసం ఫువ్వో, ఫలమో ఇస్తే ఇవ్వు లేదంటే లేదని చెప్పు. అంతే కానీ మీ లోపల్లోపల రాజకీయాల్లో మెమెందుకు సార్ ఇన్వాల్వ్ అవ్వాలి... చారి గారూ దయచేసి ఇన్వాల్వ్ చేయకండీ... మీకు దండం పెడతాము..”


మరింత సమాచారం తెలుసుకోండి: