పార్టీని పటిష్టం చేసుకునే వ్యూహాల్లో చేరికలు ఒకటి.. పార్టీ బలోపేతం అవుతుందనో... ఎన్నికల సమయంలో కలసి వస్తుందనో.. చేరికలను ప్రోత్సహిస్తే.. అది కాస్తా వర్గ పోరుకు అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో అదే జరుగుతోంది. జిల్లాలో కాంగ్రెస్ నేతలుగా పేరున్న జేసీ సోదరులను గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి తీసుకున్నారు. 

ఇప్పుడు అనంతపురం టీడీపీలో అదే వర్గపోరుకు దారి తీసింది. ప్రధానంగా జేసీ తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డికి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది కాస్తా మాటల యుద్దం రూపంలో బయటపడుతోంది. ఇటీవల ప్రభాకర చౌదరి ప్రారంభించిన లక్ష మొక్కల కార్యక్రమంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 

దీంతో అది కాస్తా డైలాగ్ వార్ కు దారి తీసింది. అవసరమైతే భౌతిక దాడులకూ వెనుకాడనని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. దీనికి ప్రభాకర చౌదరి కూడా ఘాటుగానే స్పందించారు.  ఎవరొచ్చినా ప్రజాస్వామ్య యుతంగానే ఎదుర్కొంటానంటూ సవాల్ చేశారు. పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే.. చౌదరిగారిపై రెడ్డిగారు దాడి చేస్తారనేంతవరకూ వెళ్లింది.

ఇద్దరు ప్రభాకరుల యుద్ధం నేపథ్యంలో పోలీసులు అలెర్టయ్యారు. ఎందుకైనా మంచిదని చౌదరిగారి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలిసిన ప్రభాకర చౌదరి మాత్రం తనకెలాంటి బందోబస్తు వద్దని... ఎవరొచ్చినా తానొక్కడినే ఎదుర్కొంటానంటున్నారు. పోలీసులకు నచ్చజెప్పి పంపించేశారు. ఇప్పటికైనా చంద్రబాబు జోక్యం చేసుకుని వ్యవహారం సర్దుబాటు చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: