వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాజయ్య కుటుంబ సభ్యులే తన కోడలిని, ముగ్గురు మనుమలను దారుణంగా హత్య చేశారని ఇప్పుడు డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంటిలో కనిపిస్తున్న ఆధారాలు అన్నీ కూడా ఇది హత్యేనని చాటిచెపుతున్నాయని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. రాజయ్య కోడలు, ముగ్గురు మనుమలు ఘోర అగ్ని ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇది నూరుశాతం హత్యేనని ఆయన ఇంటి వద్ద గుమికూడిన మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తక్షణం హత్యకేసు కింద రాజయ్య కుటుంబసభ్యులు అందరినీ అరెస్టుచేసి... పోలీసులు నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. 


రాజయ్య ఇంట్లో జరిగిన విషాదంలో నాలుగు మరణాలూ.. హత్యేనని అనుమానాలు కలిగించే అనేక ఇతర ఆధారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన రెండు గ్యాస్‌ సిలిండర్లు ఫస్ట్‌ఫ్లోర్‌లోని బెడ్‌రూంలో ఉండడం, ముందురోజు రాత్రి రాజయ్య దంపతులు, సారిక పెద్దఎత్తున గొడవ పడడం వంటివి అనుమానాలు కలిగిస్తున్నాయి. 


రాజయ్య తనకు ఎలాంటి అన్యాయం చేశాడో వివరిస్తూ సారిక నాలుగు రోజుల కిందట ఏఐసీసీకి ఒక ఉత్తరం రాసినట్లు కూడా చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వవద్దంటూ అందులో కోరారు కూడా. అయితే, టిక్కెట్‌ రావడంతో ఇప్పుడు రాజయ్యకు వ్యతిరేకంగా తాను మళ్లీ ఆందోళనచేస్తానని, సారిక మామను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వారు పెద్దఎత్తున ఘర్షణ పడినట్లు చెప్పుకుంటున్నారు. చాలా మంది ఇరుగుపొరుగు వారు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అంటున్నరు. ఇలాంటి అన్ని కారణాలను విశ్లేషించినప్పుడు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నట్లుగా హత్య కోణంలోనూ పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


మరోవైపు పోలీసులు కూడా ఇదమిత్థంగా ఇది ప్రమాదమా? ఆత్మహత్యా? అని తేల్చిచెప్పడంలేదు. ఈ మరణాల గురించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రమే వారు వెల్లడిస్తున్నారు. హత్య అయిఉండే అవకాశం ఉందా అని అడుగుతున్నప్పటికీ.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నాం అని మాత్రమే పోలీసు అధికారులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: