బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన నేప‌థ్యంలో ఇక మిగిలిన తంతైనా ఫ‌లితాల కోసం దేశమంతా ఉత్కంఠ‌గా ఎదురుచుస్తొంది. అయితే ఈ ఎన్నిక‌లు కేవ‌లం బీహార్ కే ప‌రిమితం కాకుండా దేశ  వ్యాప్తంగా జ‌రుగుతున్న సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా క‌లిగించింది. అయితే బీహార్ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఎగ్జిట్ ఫోల్ ఫ‌లితాల‌ను ఇచ్చేశాయి. ఇందులో ఎన్డీఏ కూట‌మి కంటే మ‌హా కూట‌మి కే ఎక్కువ సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించాయి. ఈ స‌ర్వేలు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సైతం ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కు స‌రిస‌మానంగా ఫ‌లితాలు క‌నిపించాయి. అయితే ఈ బీహార్ ఎన్నిక‌లు అన్ని పార్టీల కంటే ఎన్డీఏ కూట‌మికి చాలా కీల‌కం కానున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం మొద‌టి ఎన్నిక‌లు కావ‌డం, అంతేకాక ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎన్డీఏ భాగ‌స్వామ్య పార్టీ అయిన బీజేపీ నేత ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పాల‌నకు ప‌రీక్ష గానే చెప్పాలి. అంతేకాకుండా ఈ ఎల‌క్ష‌న్ లో ప్ర‌ధాని మోడీ నిర్వీర్యామంగా ప‌నిచేశారు. బ‌హుశా ఆయ‌న గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూడా ఇంత‌గా ప్ర‌చారం చేయ‌కుండా ఉండోచ్చు.


 ప్ర‌ధాని వ‌చ్చి విస్తృత ప్ర‌చారం చేయడం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం


గ‌తంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని వ‌చ్చి విస్తృత ప్ర‌చారం చేయడం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఇక ప్ర‌చారంలో ప్ర‌ధాని చేసిన వాగ్దానాలు ఇంతా అంత కాదు. తాను ప్ర‌ధానిని అనే సంగతి మ‌రిచిపోయి మ‌రి బీహార్ ఎన్నిక‌ల్లో అభ్యర్థిని అనుకొని ప్ర‌చారం చేశారు. ప్ర‌సంగాలు కూడా ఆయ‌న స్థాయికి త‌గిన‌ట్టుగా లేవు. ఇక ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోలింగ్ ముగిసింది. ఇంతగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపెవ‌రిది? బీజేపీ కూట‌మికి ఈసారి ఎన్ని సీట్లు వ‌స్తాయి. బీహార్ ప్ర‌జ‌లు మ‌ళ్లీ నితీష్ కే ప‌ట్టం క‌ట్ట‌నున్నారా..? అంటే ఎగ్జిట్ ఫోల్ స‌ర్వే లు అవుననే అంటున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో.. ప్ర‌భుత్వ ఏర్పాటు కు అవ‌స‌ర‌మైన క‌నీస మెజారిటీ 122 సీట్లు.  బీహార్ లో 5 విడ‌త‌లుగా జరిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై వివిధ స‌ర్వే సంస్థ‌లు, టీవీ ఛాన‌ళ్లు.. మొత్తం పోలింగ్ స‌ర‌ళి పై త‌మ స‌ర్వేల ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి.


టైమ్స్ నౌ-సి ఓట‌ర్ స‌ర్వే లో మ‌హాకూట‌మికి 122 సీట్లు, ఎన్డీఏకు 111, ఇత‌రుల‌కు 10 గెలుచుకుంటార‌ని తేలింది. న్యూస్ ఎక్స్-సీఎన్ఎక్స్ స‌ర్వే లో మ‌హా కూట‌మికి 130-140 సీట్లు, ఎన్డీఏ కు 90-100 సీట్లు, ఇత‌రులు 13-23 సీట్లు వస్తాయ‌ని తెలిపింది. ఇండియా టీవీ  స‌ర్వే మ‌హాకూట‌మికి 112-132 సీట్లు, ఎన్డీఏ కు 101-121 సీట్లు, ఇత‌రులు 6 నుంచి 14 సీట్లు సాదిస్తార‌ని వెల్ల‌డయ్యింది.  ఇక‌పోతే గ‌త 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీయూ, బీజేపీ లు ఉమ్మ‌డిగా పోటీచేసి భారీ మెజారిటీ సాధించాయి. ఆ ఎన్నిక‌ల్లో జేడీయూకు 115 సీట్లు, బీజేపీకి 91 సీట్లు ల‌భించాయి. ఒంట‌రిగా పోటీ చేసిన ఆర్జేడీకి 22 సీట్లు రాగా, కాంగ్రెస్ కు 4 సీట్లు ల‌భించాయి. 2013 లో న‌రేంద్ర‌మోడీ ని బీజేపీ ప్ర‌చార క‌మిటీ సార‌థిగా ప్ర‌క‌టించ‌టంతో నితీశ్ కుమార్ ఎన్డీఏ తో తెగ‌తెంపులు చేసుకున్నారు. అనంత‌రం జ‌రిగిన 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీహార్ లోని మొత్తం 40 లోక్ స‌భ స్థానాల‌కు గానూ.. బీజేపీ సొంతంగా 22 సీట్లు గెలుచుకోగా దాని మిత్ర ప‌క్షాలు మ‌రో 9 సీట్లు సొంత చేసుకున్నాయి.


ఒంట‌రిగా పోటీ చేసిన జేడీయూ కేవ‌లం రెండు సీట్ల‌లోనే గెలిచింది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీలు క‌లిసి పోటీ చేయగా..ఆర్జేడీ కి 4 సీట్లు,  కాంగ్రెస్‌కు 2 సీట్లు, ఎన్‌సీపీకి ఒక సీటు చొప్పున లభించాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు మ‌హా కూట‌మి గా క‌లిసి పోటీచేశాయి. ఎన్డీఏ లో భాగంగా బీజేపీ సార‌థ్యంలో ఎల్జేపీ, హిందుస్థానీ అవామీ మోర్చా(సెక్యుల‌ర్), ఆర్ఎల్ఎస్పీ పార్టీలు క‌లిసి పోటీ చేశాయి. ఇక ఈ నెల 8వ తేది అన‌గా ఆదివారం రోజు ఫ‌లితాలు బ‌య‌ట‌కు రానున్నాయి. ఆ రోజు ఎవ‌రికి బ్యాండ్ ప‌డుతుంది. ఇదే అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతున్న ప్ర‌శ్న‌. ప్ర‌ధానంగా పోటీ జరిగింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు, జేడీయూ నేతృత్వంలోని మ‌హాకూట‌మి కి మ‌ధ్య. మిగ‌తా పార్టీలు లెక్క‌లోవి కాదు. అధికారం మ‌హా కూట‌మికే ద‌క్కుతుంద‌ని మీడియా సంస్థ‌లు, ఎన్నిక‌ల స‌ర్వేలు నిర్వ‌హించే సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. కొన్ని టీవీ ఛానళ్ల‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఉత్కంఠ భ‌రిత‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయి. క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌య్యాయి.


ఇక బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పుల‌కు నాంది ప‌లుకుతాయ‌ని, న‌రేంద్ర‌మోడీ కి క‌ష్ట కాల‌మేన‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ప్ర‌భావం 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌పై ఉంటుంద‌ని. మోడీ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిన‌ట్లేన‌ని ఇంకొంద‌రు చెబుతున్నారు. ఎన్డీఏ ఓడిపోతే ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తి చెందుతుంద‌ని.. మోడీ ప‌ద‌వికి కూడా ఎస‌రు రావ‌చ్చ‌ని కూడా కొంద‌రు భావిస్తున్నారు. ఎన్డీఏ ప‌రాజ‌యం పాలైతే ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీ-టీడీపీ మ‌ధ్య  అంత‌గా స‌ఖ్య‌త లేదు. మాట‌ల యుధ్ధం  జ‌రుగుతోంది. ఎన్టీఏ ఓడిపోతే ఏపీలో బీజేపీ దూకుడు త‌గ్గుతుంద‌ని, టీడీపీ మోడీ కి మ‌రీ కాలుచేతులు ప‌ట్టుకుని బ్ర‌తిమిలాడద‌ని అనుకుంటున్నారు. కాక‌పోతే ఎన్డీఏ ఓడిపోతే ప్ర‌ధాని మోడీ ప‌రువు ప్ర‌తిష్ట‌లు మాత్రం దిగ‌జారుతాయ‌నేది వాస్త‌వం. ఎందుకంటే ప్ర‌ధాని బీహార్ ఎన్నిక‌ల్లో అన్నితానై ప్ర‌చారం చేశారు.


బీహార్ దెబ్బ‌తో ఆయ‌న మ‌రోసారి అంతర్మ‌ధ‌నంలో ప‌డ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఏపీ లో ఆయ‌న పై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదురుకుంటున్న నేప‌థ్యంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, ప్యాకేజీనో వెంట‌నే ప్ర‌క‌టించి రాష్ట్రంలో పార్టీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌ని ఊహిస్తున్నారు. తెలంగాణ లో కూడా ఇదే విధానం అనుస‌రించ‌వచ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దేశంలో ప్రాంతీయ పార్టీలు బ‌ల‌ప‌డ‌వ‌చ్చని.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల‌తో కూడిన సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. వచ్చే ఏడాది.. ఆపై ఏడాది దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. బీహార్ లో ఎన్డీఏ కు గ‌ట్టి దెబ్బ త‌గిలితే మాత్రం ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాలు ఉండ‌క పోవ‌చ్చు. ఏదిఏమైనా బీహార్ ఎన్నిక‌ల ఎన్డీఏ కు ఎలాంటి దారి చూప‌నుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: