బడా పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు పార్టీ బేధాలు ఉండవు.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారు.. ఆ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరపుతుంటారు. ఓ పార్టీ అంటూ మడికట్టుకుని కూర్చుంటే వారు తమ కార్యకలాపాలు కొనసాగించలేరు. అధికారంలో ఉన్నవారికి సమర్పించుకుంటూ.. తమ పబ్బంగడుపుకోవడం అనేది ఈ కాంట్రాక్టర్లకూ, ఇండిస్ట్రియలిస్టులకూ టెండరుతో పెట్టిన విద్య. 

మెగా ఇంజినీరింగ్ సంస్థ.. తెలుగు రాష్ట్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు చేపడుతున్న సంస్థ. వైఎస్ జలయజ్ఞం ప్రారంభించినప్పుడు.. ఈ సంస్థ ఎక్కువ ప్రాజెక్టుకు సంపాదించుకుంది. మొదట్లో ఈ సంస్థ అధినేత కృష్ణారెడ్డి వైఎస్ సన్నిహితుడు కేవీపీ బినామీ అంటూ వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఈ కంపెనీ పని అయిపోయినట్టే అని పారిశ్రామిక వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. 

కానీ విచిత్రంగా చంద్రబాబు సర్కారు కూడా పట్టిసీమ వంటి ప్రాజెక్టులు ఈ మెగా సంస్థకే అప్పగించింది. ఇటు కేసీఆర్ ప్రభుత్వం నిర్వహిస్తున్న జలహారం, ఇతర ప్రాజెక్టులనూ మెగా సంస్థ చేపడుతోంది. ఇంతటి బ్యాక్ డ్రాప్ ఉన్న మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి పెద్దగా మీడియా ముందుకు రారు. లేటెస్టుగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ సంచనల వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి బినామీ కాదని కుండబద్దలు కొట్టారు. 

నిజానికి 2006 వరకు కెవిపి రామచంద్రరావుతో తనకు పరిచయమే లేదని కృష్ణారెడ్డి అంటున్నారు. మొదట్లో కేవీపీ బినామీ అని.. ఆ తర్వాత జగన్ బినామీ అనీ కొందరు విమర్శిస్తుంటారని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని చెబుతున్నారు. అదే నిజమైతే జగన్ బినామీకి చంద్రబాబు కాంట్రాక్టుల ఇస్తారా అని ప్రశ్నించారు.తమ సంస్థ దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు చేస్తోందని.. ఏడు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: