ఆంధ్రా సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం సంగతి గుర్తుంది కదా.. ఇప్పుడంటే కాస్త అంతా మర్చిపోయారు కానీ.. తెలంగాణ ఏర్పడక ముందు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వెరీ పాపులర్. తనకు ఆంధ్రా, తెలంగాణ రెండు కళ్లని.. ఏ కన్ను కావాలని అడిగితే ఏం చెబుతామని చంద్రబాబు తరచూ చెప్పేవారు. ఆ తర్వాత అదో పెద్ద జోక్ గా మారింది. 

బాబు ఎంతగా రెండు కళ్ల సిద్దాంతం చెప్పినా.. ఆయనకు ఆ రెండింటిలో ఒక కన్నుపైనే ప్రేమ ఎక్కువన్న సంగతి అందరికీ తెలుసు. అదే కన్నో కూడా అందరికీ బాగా తెలిసిందే. తెలంగాణ విషయంలో రెండు కళ్ల సిద్దాంతమే కాదు. రెండు నాలికల సిద్ధాంతమూ బాగా పాపులరే. మొత్తానికి ఆ సిద్ధాంత, రాద్దాంతాల తర్వాతే తెలంగాణ ఏర్పడింది. రెండు ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉంది. 

ఆంధ్రాలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తర్వాత మూడో స్థానంలో ఉంది. మొన్నటి వరంగల్ ఉప ఎన్నిక ఈ స్థానాన్నిమరోసారి గుర్తు చేసింది. అసలే పార్టీ పరిస్థితి ఈ ప్రాంతంలో ఇంత ఘోరంగా ఉంటే.. ఈ సమయంలో టీడీపీ మరోసారి బ్లండర్ చేసింది. మరి ఇది కావాలని చేసిందో.. యథాలాపంగా జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. 

తెలంగాణ ఇవ్వడంలో రాజ్యాంగాన్ని యూపీఏ అపహాస్యం చేసిందంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో ప్రసంగించడం ఆశ్చర్యం నింపింది. చంద్రబాబు అనుమతి లేకుండా రామ్మోహన్ నాయుడు వంటి కుర్ర నేత ఇలాంటి ప్రసంగం చేసి ఉండరు. అంటే అది టీడీపీ అభిప్రాయమే. ఇప్పుడు పార్లమెంటులో అలాంటి అభిప్రాయం ఏర్పాటు చేయడం అవసరమా అన్నది ఆ పార్టీ ఆలోచించుకోవాలి. 

అలాంటి ప్రసంగం ద్వారా టీడీపీ మరోసారి తెలంగాణ ప్రజల కోపానికి గురి కావలసి వచ్చింది. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి తెలంగాణ ఇచ్చారని తెలంగాణవాసులెవరూ అనుకోవడం లేదు. ఇప్పుడు ఇలాంటి ప్రసంగం ద్వారా ఏపీలో మైలేజీ వచ్చే అవకాశమూ అంతంత మాత్రమే. కానీ టీడీపీ తెలంగాణవాసుల దృష్టిలో మరింతగా విశ్వాసం కోల్పోయిందన్న మాట మాత్రం వాస్తవం. 


మరింత సమాచారం తెలుసుకోండి: