తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకనం కట్టుకున్నారు. ఆ మద్య ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ కూడా అమెరికా పర్యటన చేసిన విషయం తెలిసిందే...తెలంగాణ రాష్ట్రంలో పెట్టు బడులకు, ఇక్కడ కంపెనీ ఏర్పాట్లకు అనుకూలమైన ప్రదేశం అని అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయని వారికి తెలియజేశారు. తాజాగా ఎల్‌ఈడీ లైట్ల తయారీ యూనిట్‌ స్థాపనకు అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్‌ ఆఎ్టానిక్‌ డి వైసెస్‌ ఇంటర్నేషన్‌ కంపెనీ ముందుకొచ్చింది.

సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారత్ కు చెందిన సేల్స్ కంపెనీ సిస్కా, అడ్వాన్స్ ఆస్ట్రానిక్ డివైసెస్ (ఏవోడీ) ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఈ యూనిట్‌ స్థాపనకు అవసరమయ్యే 50 ఎకరాల భూమి ఇచ్చేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  ప్రభుత్వం సహకరిస్తే వచ్చే ఏడాది మార్చి నుంచి ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ ప్రతినిధులు తెలుపగా వీలైనంత త్వరగా భూమితోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం చెప్పారు.

తక్కువ విద్యుత్తు వినియోగంతో ఎక్కువ వెలుగు అందించే ఎల్‌ఇడీ లైట్ల వాడకం పెరగాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్‌ సత్ఫలితాలిస్తోందని, ఇప్పటికే 69 పరిశ్రమలకు అనుమతులిచ్చామని, అవినీతికి ఆస్కారం లేకుండా ‘బిజినెస్‌ ఎట్‌ ఈజ్‌’ అనే పద్ధతిలో తెలంగాణ పారిశ్రామిక విధానం ఉన్నదన్నారు. త్వరలోనే రాష్ట్రానికి ఫార్మా సిటీ, సినిమా సిటీ రానున్నాయని, ఐటీ కంపెనీలు కూడా తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడే నెలకొల్పనున్నాయని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: