ఆంధ్రాలో ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రతిపక్షాన్ని మరింతగా దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా కుల సమీకరణాల లెక్కలు వేస్తున్నారు. వైసీపీకి బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం పార్టీలోని సీనియర్లను కూడా పక్కకు పెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల నెల్లూరు జిల్లాలో ఆనం సోదరులు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వారి చేరికతో నెల్లూరు రెడ్లను టీడీపీ దువ్వే ప్రయత్నం చేసింది. వైసీపీ బలంగా ఉన్నది రాయలసీమ ప్రాంతంలోనే. అందుకు ఆ ప్రాంతంలోని రెడ్లకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆనం సోదరుల చేరిక తర్వాత మరికొందరు రెడ్డి నాయకులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. 

నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డికి బాబు మంత్రి పదవి కూడా కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్లను ఊరికే పార్టీలో చేర్చుకోకుండా.. వారికి మంత్రి పదవి కూడా కట్టబెడితే ఆ సామాజిక వర్గ నేతల్లో నమ్మకం పెంచవచ్చన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఆనంకు మంత్రిపదవి ఇచ్చి రెడ్డి వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారట. 

దీనికితోడు ఇప్పటి వరకూ కీలకమైన ఆర్థిక శాఖను చూస్తున్న యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే ఆనంకు లైన్ ఇంకా క్లియర్ అవుతుంది. ఆనం గతంలోనూ ఆర్థిక శాఖను నిర్వహించారు. ఆయన ట్రాక్ రికార్డు కూడా బావుంది. వివాదరహితుడు, పనిమంతుడు అన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆనంకు ఇమ్మీడియట్ ప్రమోషన్ ఇవ్వాలని బాబు నిర్ణయించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: