ముంబైలో ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం నడిపిన హ్యూండయ్ యాక్సెంట్ కారు, రెస్టారెంటును వేలంపాటకు పెట్టారు. భారత్ లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరొందిన మాఫియా డాన్ దావూద్ ముఠా నుంచి తీవ్ర బెదిరింపులు వచ్చినప్పటికీ వెరవకుండా ఈ వేలం నిర్వహించారు. దావూద్ స్వంతంగా నడిపిన రెస్టారెంట్ రౌనక్ అఫ్రోజ్‌ను జర్నలిస్టు ఎస్ బాలకృష్ణన్ నాలుగు కోట్ల రూపాయలకు వేలంలో పాడి గెల్చుకున్నారు. అలాగే ఆయన కారును హిందూ మహాసభకు చెందిన స్వామి చక్రపాణి రూ.32 వేలకు కొనుగోలు చేశారు.

 

స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ 1976 కింద దావూద్ ఆస్తుల వేలాన్ని నిర్వహించారు. అశ్విన్ ఆక్షనీర్స్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ఈ వేలం నిర్వహణకు అనుమతి పొందింది. దావూద్ డెన్ అయిన బెందీ బజార్‌లో ఉన్న హోటల్ రౌనక్ అఫ్రోజ్‌ని ఎన్జీఓకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ జర్నలిస్టు ఎస్. బాలకృష్ణన్ రూ. 4.28కోట్లకు వేలం పాడి గెల్చుకున్నారు. ఈవిషయంలో తనకు దావూద్ సహచరులనుంచి బెదిరింపు కాల్ కూడా వచ్చిందని చెప్పారు. చోటా షకీల్ స్వయంగా తనకు కాల్ చేసి బెదిరించారంటే ఈ హోటల్ ఖచ్చితంగా దావూద్‌దే అయి ఉంటుందని తాను విశ్వసిస్తున్నానని బాలకృష్ణన్ చెప్పారు.

 

ముంబైలోని హోటల్ డిప్లొమేట్‌లో బుధవారం జరిగిన బహిరంగ వేలంలో దావూద్ ప్రాపర్టీని స్థానికులు కొనుగోలు చేశారు. ఈ కొనుగోలుతో భారత మాత గౌరవం ఇనుమడించిందని, సరిహద్దుల ఆవలి నుంచి దావూద్ సహచరుడు ఫోన్ చేసి మరీ బెదిరించినప్పటికీ ఈ వేలంలో పాల్గొని కొనుగోలు చేశానని బాలకృష్ణన్ గర్వంగా చెప్పారు. దేశభక్తి గల ప్రజలు ఈ వేలం విషయమై తమకు సహాయం చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే దావూద్ ఆస్తిని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించమని, తమ ట్రస్టు దీన్ని బెందీ బజారులోని పిల్లలకోసం కంప్యూటర్ శిక్షణా సంస్థగా మలచి నిర్వహిస్తుందని చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు అష్పాక్ ఉల్లా ఖాన్ పేరుతో ఈ శిక్షణా సంస్థను నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

మరోవైపున దావూద్ కారును 32 వేల రూపాయలకు కొనుగోలు చేసిన స్వామి చక్రపాణి ఆ కారును అంబులెన్సుగా ఉపయోగిస్తామని అలా వీలుకాకపోతే దాన్ని దావూద్ ది్ష్టి బొమ్మగా భావించి తగులబెడతామని చెప్పారు. దావూద్ ముఠాకు ఎవరూ భయబడవలసిన అవసరం లేదని చెప్పడానికే తమ సంస్థ ఈ వేలంపాటలో పాల్గొన్నదని ఆయన పేర్కొన్నారు.

 

1993 ముంబయ్ పేలుళ్లకు వ్యూహం రచించింది దావుద్ ఇబ్రహీం. ఈ పేలుళ్లలో 250 మంది చనిపోగా 700 మంది గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే భారత్‌నుంచి పారిపోయిన దావూద్ పాకిస్తాన్‌లో దాక్కున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: