మహిళలపై నేరాలను అడ్డుకునేందుకు మన దేశంలో ఎన్నో చట్టాలున్నాయి. అలాగే బాలల హక్కుల కోసం కూడా మంచి చట్టాలే ఉన్నాయి. మరి ఈ రెండింటికీ ఘర్షణ వస్తే.. బాలల రక్షణ కోసం చేసిన చట్టాలు మహిళల ఆత్మరక్షణకు ఆటంకంగా నిలిస్తే.. ఇప్పుడు ఈ పరిస్థితిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దశాబ్దాల నాటి చట్టాలను మార్చి కొత్త చట్టాలు తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

దిల్లీలో తన బాయ్ ఫ్రెండ్ తో సినిమా చూసి వస్తున్న అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసిన దారుణం నిర్భయ ఘటనగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ అత్యాచారం ఎంత అమానవీయంగా జరిగిందో తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అమ్మాయి మానంలో ఇనుపరాడ్డు గుచ్చి మరీ నరకం చూపిన విషయం తెలిసి ప్రపంచమే నివ్వెరపోయింది. 

ఇంతటి కిరాతకంలో కీలకమైన ముద్దాయి ఇప్పుడు ఈ చర్చకు దారి తీశాడు. నిర్భయను అతిదారుణంగా హింసించిన వారిలో కీలకమైన అతడికి ఆ నేరం జరిగేనాటికి 16 ఏళ్లే. అంటే చట్టం ప్రకారం అతడో బాల నేరస్తుడు. బాలనేరస్తులు ఎంతటి దారుణం చేసినా.. చివరకు రేపులు, మర్డర్లు చేసినా గరిష్టంగా 3 ఏళ్లు మాత్రమే శిక్ష పడుతుంది. నిర్భయ  నేరం విషయంలోనూ అదే జరిగింది. 

ఇప్పుడా నేరగాడు మేజర్ అయ్యాడు. శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదల అయ్యాడు. మహా ప్రభో వాడు బాలుడే అయినా మహా క్రూరుడు.. అతన్ని వదలిపెట్టొద్దంటూ కోర్టులకు పెట్టిన పిటీషన్లు చట్టం కారణంగా కొట్టివేయబడ్డాయి. ఇప్పుడితే దేశవ్యాప్త చర్చకు దారి తీస్తోంది. ప్రపంచమంతా నివ్వెరపోయిన దారుణం జరిగినా.. తన కుమార్తెకు న్యాయం  జరగలేదంటూ నిర్భయ తల్లి రోదిస్తోంది. న్యాయపోరాటం చేస్తానంటోంది. చట్టాలను మార్చకపోతే.. మైనర్ నేరగాళ్లకు రేపులు చేసుకోవడానికి ప్రభుత్వమే లైసెన్సు ఇచ్చినట్టు భావించాల్సి వస్తుందన్న నిర్భయ తల్లి మాటలు ఆలోచింపజేయడంలేదూ..!?



మరింత సమాచారం తెలుసుకోండి: