కాపులకు రిజర్వేషన్.. ఇప్పుడు ఆంధ్రాలో ఇదే హాట్ టాపిక్. కాపుల ఐక్య గర్జన సభ సందర్భంగా జరిగిన హింసాకాండతో కాపుల రిజర్వేషన్ అంశంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. అప్పటివరకూ ఎవరో ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలినవారు  ఈ అంశంపై స్పందించే వారు కాదు.  

కానీ ఇప్పుడు మాత్రం.. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమేనా.. అందుకు ఎలాంటి మార్గాలున్నాయి.. చంద్రబాబు వ్యుహం ఏంటి.. వంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వెదుకులాట తీవ్రమైంది. కాపుల రిజర్వేషన్ కు సంబంధించిన వాస్తవాలను తెలుసుకుంటే.. కాపులకు రిజర్వేషన్ కల్పించడం దాదాపు అసాధ్యం అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. 

నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించ కూడదు. ఇంత శాతమే రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినా అనేక సుప్రీంకోర్టు తీర్పులు, వ్యాఖ్యల ఆధారంగా 50 శాతంలోపే రిజర్వేషన్లు ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీలో 49 శాతం రిజర్వేషన్ ఉంది. కాపులకు కనీసం 5 నుంచి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం 60 శాతం దాటిపోతుంది. 

అయినా సరే కాపులకరు రిజర్వేషన్ ఇవ్వాలంటే అందుకు రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. అంటే దేశంలోని మిగిలిన పార్టీల వారు కూడా దీన్ని అంగీకరించాల్సి ఉంటుంది. అది అంత సులభం కాదు. ఎన్డీఏ పక్షాల వరకూ చంద్రబాబు ఏదో ఒకలా మేనేజ్ చేసినా.. మిగిలిన పార్టీలను ఒప్పించడం దాదాపు అసాధ్యం. అయినా సరే ఏదోలా అన్ని పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణ చేసి 9 వ షెడ్యూళ్లో కాపు రిజర్వేషన్ అంశాన్ని ఉంచి రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంది. 

కానీ ఈ చట్టం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ఎవరైనా సరే సుప్రీంకోర్టును ఆశ్రయించిన పక్షంలో ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షిస్తుంది. కోర్టుల్లో ఈ చట్టం నిలబడే అవకాశాలు దాదాపు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే.. దాదాపు అన్ని పార్టీలూ కాపుల జనాభాను ఓటు బ్యాంకుగా చూస్తూ కాపులను మభ్యపెడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: