తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంత మంది నాయకులు వలస వెళ్లినా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం  తెలంగాణలో టీడీపీ భవితవ్యంపై అంతులేని నమ్మకంతోనే ఉన్నారు. మరి నాయకుడు అన్నాక ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండాల్సిందే సుమా. అందులోనూ పగ్గాలు చేతిలో పట్టుకున్నవాడి ఆ మాత్రం గాంభీర్యం చూపకపోతే కేడర్ కూడా నీరుగారిపోయే ప్రమాదం ఉంది. 

అందుకే వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి  పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. వరంగల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన సమావేశం అయ్యారు. పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి నిస్వార్థంగా పనిచేస్తామని అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎర్రబెల్లి సహా పార్టీ ని వీడిన నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

నిన్నటి వరకూ రహస్య మిత్రులుగా ఉన్న ఎర్రబెల్లి, కేసీఆర్ ఇప్పుడు బహిరంగ మిత్రులయ్యారని మండిపడ్డారు. పార్టీ ప్రెసిడెంట్ అయ్యాక కూడా బూతులు తిడితే బావోదని పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిట్టడంలో కంట్రోల్ చేసుకుంటున్నానన్నారు. అలా కంట్రోల్ చేసుకుంటున్నా అని చెబుతూనే.. ఎర్రబెల్లిని విశ్వాసం లేని కుక్కగా వర్ణించారు. 

టీడీపీ  నుంచి వెళ్లిపోయిన మనుషులు తమకు శవాలతో సమానం అంటూ ఆవేశపడిపోయారు. కొంతమంది నాయకులు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తిన్న ఉప్పూకారం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఎర్రబెల్లిని ఉద్దేశించి కామెంట్ చేశారు. అలాంటి నేతలు ఎంతమంది పార్టీ వీడిపోయినా వచ్చిన నష్టం ఏమీలేదని అన్నారు. టీడీపీ పార్టీ జెండా తయారు చేసింది నేనే అని చెప్పుకునే నాయకులు కూడా ఇప్పుడు ఆ జెండా లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. 

నిన్న మొన్నటి వరకూ వరంగల్ టీఆర్ ఎస్ నేత వినయ్ భాస్కర్  ఎర్రబెల్లిని డీలర్ దయాకర్, దాలర్ దయాకర్ అంటూ విమర్శించారని.. ఇప్పుడు అదే వినయ్ భాస్కర్ తో కలసి పనిచేస్తావా అంటూ ఎర్రబెల్లిని ప్రశ్నించారు. కొండా మురళికి, ఎర్రబెల్లి మధ్య జరిగిన రాజకీయ పోరులో దాదాపు 19 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని.. ఇప్పుడు వారిద్దరూ ఒకే పార్టీ పనిచేసేందుకు రెడీ అయ్యారని గుర్తు చేశారు. అందుకే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించి తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. 



మరింత సమాచారం తెలుసుకోండి: