ఎంత చెప్పుకున్నా.. జగన్ చంద్రబాబుకు చాలా జూనియర్. వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ చాలా చాలా జూనియర్. బాబుకు పదేళ్లపాటు ప్రతిపక్షనేత హోదాలో అనుభవం ఉంటే.. జగన్ కు ఇదే తొలిసారియే. అందుకే సీనియర్లను సింపుల్ గా ఫాలో అయిపోతున్నాడు. అందులోనూ చంద్రబాబు పాలసీలు బాగా నచ్చాయేమో. ఆయన బాటే ఎంచుకున్నాడు. 

ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమాయాల సమయంలో తొలిరోజు ఎన్టీఆర్ ఘాట్ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చేవారు. దారి పొడుగూతా సర్కారు వ్యతిరేక నినాదాలు చేసేవారు. అప్పటి సమస్యను బట్టి చేతిలో లాంతర్లో, ఎండిపోయిన పంటకంకులో ప్రదర్శించేవారు. ఇప్పుడు జగన్ కూడా అదే పద్దతి ఫాలో అవుతున్నాడు. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో పాదయాత్రగా అసెంబ్లీకి తరలివచ్చారు. సర్కారు వైఖరికి నిరసగా మెడలో నల్ల కండువాలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తాము  నిరసన యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో మీడియాకు వివరించారు. చంద్రబాబు అవినీతి సొమ్ములతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బుల్ని ఎరగా చూపుతున్నారన్నారు జగన్. 

అక్రమాల సొమ్ముతో ప్రలోభాలు పెట్టి ఒక్కో ఎమ్మెల్యేకు సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయిలు ఎర చూపి ఆశలు చూపించి నిస్సిగ్గుగా తమ పార్టీలోకి లాక్కొంటున్నందుకు తాము నల్ల కండువాలతో నిరసన తెలుపుతున్నామని ఆయన వివరించారు. రాజధాని విషయంలో రైతులను తప్పు దోవ పట్టించి మోసం చేసినందుకు నిరసన తెలుపుతున్నామని జగన్ చెప్పారు. 

ఆఖరికి దళితుల్ని సైతం వదలకుండా వాళ్ల భూముల్ని లాక్కొన్నందుకు నిరసన తెలియచేస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. బినామీల లాభం కోసమే జోనలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని... తమ బినామీల భూములకు ఎక్కువ ధరలు వచ్చేట్లుగానూ, మిగిలిన వారి భూములకు పెద్దగా ధర రాకుండానూ వ్యూహం పన్ని జోనలింగ్ వ్యవస్థ ను ఏర్పాటు చేసినందుకు నిరసన తెలుపుతున్నట్లు జగన్ వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: