ఫేస్ బుక్.. ఇది ఇప్పుడు చాలా మందికి ఓ నిత్యావసర వస్తువు అయ్యింది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయేవరకూ ఈ ముఖ పుస్తకంలో ముఖం దూర్చకుండా చాలామందికి రోజు గడవదు. ఆనందం, దుఃఖం, విచారం, ఆశ్చర్యం.. ఏ భావాన్నైనా సెకన్లలో అందరికీ పంపే వీలు ఉండటమే ఇందుకు కారణం.

అందుకే రోజురోజుకూ ఫేస్ బుక్ ఉపయోగించేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే అలాంటి ఫేస్ బుక్ ముందు ముందు ఓ శ్మశాన వాటికగా మారిపోతుందట. ఎలాగంటారా.. ఇప్పుడు ఫేస్ బుక్ వాడుతున్న వారెవరైనా హఠాత్తుగా మరణించినా వారి ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని క్లోజ్ చేయడం సాధ్యపడదు. 

ఏ వ్యక్తి ఫేస్ బుక్ అకౌంటైనా క్లోజ్ చేయాలంటే.. దాని లాగిన్ పాస్ వర్డ్ తెలియాలి. పాస్ వర్డ్ తెలిసిన కుటుంబ సభ్యులు, మిత్రులు దాన్ని క్లోజ్ చేయవచ్చు. కానీ సాధారణంగా తన పాస్ వర్డ్ ను ఎవరితోనూ పంచుకోరు. అందువల్ల ఎవరైనా ఫేస్ బుక్ ఉపయోగించేవారు అకస్మాత్తుగా చనిపోయినా వారి అకౌంట్ మాత్రం కొనసాగుతూనే ఉంటుందన్నమాట. 

ప్రస్తుతం ఫేస్ బుక్ ఉపయోగిస్తున్న వాళ్లలో చాలా మంది 2098 నాటికి చనిపోతారు. కానీ మిలియన్ల కొద్దీ ఉన్న వారి అకౌంట్లు మాత్రం కొనసాగుతాయి. అంటే ఉపయోగించని ఫేస్ బుక్ అకౌంట్ ను సమాధితో పోలిస్తే.. ఫేస్ బుక్ ముందు ముందు ఓ స్మశాన వాటికి అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. 

మసాచుసెట్స్ యూనివర్సిటీ పీహెచ్‌డీ అభ్యర్థి హచెమ్ దీనిపై పరిశోధన చేశారు.  ఆయన పరిశోధనల్లో  2010లో 3,85,968 మంది, 2012లో 5,80,000 మంది ఫేస్‌బుక్ వినియోగదారులు మరణించారని తెలిసింది. ఈ ఏడాది ఓ పదిలక్షల మంది వరకూ మరణిస్తారట. మరి ఈ సమస్యను ఫేస్ బుక్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: