శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌లో మరో అరుదైన పీఎస్‌ఎల్‌వీ-సి32 ప్రయోగానికి రంగం సిద్దమైంది. దేశంలో సొంత నావిగేషన్‌ వ్యవస్థను సమకూర్చే ప్రక్రియలో భాగంగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ను నింగిలోకి ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్‌ ప్రక్రియ 54.30 గంటల అనంతరం పదో తేదీ సాయంత్రం 4 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి32 ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ ను నింగిలోకి మోసుకుపోనుంది. 

ఇప్పటికే దేశంలో ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా ఇది మరో అడుగుగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థలో ఆరో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ ఒకటి. ఈ వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిశా నిర్దేశ సేవలందిస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలో సాయపడుతుంది. వాహనాల గమనాన్ని ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది. 

తాజాగా కక్ష్యలోకి చేరనున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఇది 12 ఏళ్లపాటు సేవలందిస్తుంది. భారత్‌ స్వీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహ వ్యవస్థలో ఇది ఆరోది. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వచ్చాక మూడు ఉపగ్రహాలు భూస్థిర కక్ష్యలో, నాలుగు ఉపగ్రహాలు భూ అనువర్తిత కక్ష్యలో పనిచేస్తాయి. 

భారత్‌ చుట్టూ 1,500 కి.మీ.దాకా విస్తరించిన ప్రాంతంలో  సేవలందిస్తుంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ షార్‌కు చేరుకున్నారు. ప్రయోగం వివరాలు తెలుసుకుని శాస్త్రవేత్తలకు పలు సూచనలు అందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భద్రతను కూడా పెంచారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేసారు.



మరింత సమాచారం తెలుసుకోండి: